టాలీవుడ్ సినీ ప్రముఖులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల తెలుగు చిత్ర సీమలోని వారికి కనీస కృతజ్ఞత లేదని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణ చేశారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారా? అని పవన్ ప్రశ్నించారు.
జగన్ హయాంలో టాలీవుడ్ అగ్రహీరోలను, దర్శక నిర్మాతలను ఎలా అవమానించారో మర్చిపోయారా అని నిలదీశారు. జూన్ 1 నుంచి ఏపీ, తెలంగాణలో థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించిన నేపథ్యంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను తగిన విధంగా స్వీకరిస్తామని అన్నారు. అయితే, జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయడం లేదని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రకటించిన తర్వాత పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఏపీలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం తాము కృషి చేస్తున్నామని, కానీ సినీ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ వాపోయారు. కేవలం తమ సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాతలు వ్యక్తిగతంగా వచ్చి కలుస్తున్నారని, చిత్ర రంగం అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ఒక్కసారి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చినా సానుకూలంగా స్పందించకపోవడంపై పవన్ అసహనం వ్యక్తం చేశారు.
దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, అశ్వినీదత్ తదితర నిర్మాతలు కలిసి ఉంటేనే ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని అన్నారు. ఇకపై వ్యక్తిగత చర్చలకు తావు లేదని, సినీ రంగం నుంచి సంబంధిత విభాగం ప్రతినిధులు సంబంధిత సంఘాల తరఫున వస్తే వాటిపై చర్చించి ప్రభుత్వంలోని సంబంధిత విభాగాలకు పంపిస్తామని పవన్ అన్నారు.
దీంతోపాటు, రాష్ట్రంలోని థియేటర్లలో నిర్వహణ, ప్రేక్షకులకు అందుతున్న మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వంటి విషయాలపై పవన్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా థియేటర్లలో అధిక ధరకు స్నాక్స్, కూల్ డ్రింక్, వాటర్ బాటిల్స్ తదితరాలు విక్రయించడంపై సంబంధిత అధికారులు దృష్టిసారించాలని పవన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి.