ఒకే ఒక్క ఘటనతో వైసీపీకి పెద్ద డ్యామేజీ ఏర్పడింది. అయితే.. ఆ ఘటన యాదృచ్ఛికంగా జరిగిందా? లేక.. కావాలనే చేశారా? అనేది పక్కన పెడితే. ప్రస్తుతం వైసీపీకి మాత్రం మూడు జిల్లాల్లో వ్యతిరేకత వ్యక్త మవుతోంది. దీనికి కారణం.. ఈ నెల 18న వైసీపీ అధినేత జగన్..గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో నిర్వహించిన యాత్ర. పార్టీ కార్యకర్త ఆత్మహత్య కారణంగా ఒంటరైనా ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు జగన్ అక్కడకు వెళ్లారు.
అయితే.. కార్యకర్తలు.. పార్టీ నాయకుల ఉచ్చులో పడ్డారు. ఈ క్రమంలో రెచ్చిపోయి పోలీసులపై దాడులు చేశారు. వారి నిబంధనలను ఉల్లంఘించారు. అదేసమయంలో పుష్ప-2 సినిమాలోని డైలాగుతో రెచ్చిపో యి ప్లకార్డులు ప్రదర్శించి వీరంగం వేశారు. ఇది పెద్ద రచ్చగా మారింది. వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.పైకి 15 మంది అని చెబుతున్నా.. దాదాపు 100 మందికిపైగానే కార్యకర్తలపై పోలీసులు చర్యలు తీసుకున్నారన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ.
దీంతో ఇక, నుంచి తమ పిల్లలను వైసీపీ కార్యక్రమాలకు పంపించకూడదని.. సత్తెనపల్లి సహా.. గుంటూరు జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లోని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇక, మా పిల్లలను పంపించం అని తేల్చి చెప్పారు. తమ కార్యకర్తలను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయా కుటుంబాలను పరామర్శించేందు కు వెళ్లిన నాయకులకు ప్రజలు ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. ఇక, తెనాలిలోనూ ఇదే జరిగింది. రౌడీ షీటర్లను కొట్టిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..జగన్ బాదిత కుటుంబాలను పరామర్శించారు.
దీంతో స్థానికంగానే కాకుండా.. జిల్లా వ్యాప్తంగా కూడా.. రౌడీ షీటర్లకు మద్దతు ఇచ్చే పార్టీగా వైసీపీపై ముద్ర పడింది. ఇలాంటి పార్టీలో ఉన్నా.. మద్దతు తెలిపినా.. తమ పిల్లలకు కూడా అవే బుద్ధులు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. అంతేకాదు.. తమ పిల్లలు కూడా చెడిపోతారని వారు అనుకుంటున్నారు. దీంతో పార్టీకి దూరంగా ఉంచేందుకు.. పిల్లలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఒక్క ఘటన.. పార్టీని ప్రజలకు దూరం చేసిందని అంటున్నారు పరిశీలకులు