తొలి సినిమా ‘జెంటిల్‌మన్’ మొదలుకుని అద్భుతమైన చిత్రాలతో భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు శంకర్. బలమైన, వైవిధ్యమైన కథలనే ఎంచుకుని వాటిని కమర్షియల్‌గానూ తిరుగులేని స్థాయికి తీసుకెళ్ళిన ఘనత ఆయన సొంతం. ఐతే ఎంత గొప్ప దర్శకుడైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవడం, ఫ్లాపులు ఎదుర్కోవడం కామనే. శంకర్ కూడా అందుకు మినహాయింపు కాదని రుజువైంది. ఐతే ఆయన్నుంచి మరీ ఇండియన్-2, గేమ్ చేంజర్ లాంటి సినిమాలు వస్తాయని మాత్రం అభిమానులు ఊహించలేదు.
‘ఇండియన్-2’ డిజాస్టర్ అయ్యాక ‘గేమ్ చేంజర్’తో పుంజుకుంటాడని అనుకుంటే.. దాంతో ఇంకా పెద్ద షాక్ తిన్నాడు. శంకర్ కష్ట కాలంలో ఉండగా ఆయనతో సినిమాకు ఒప్పుకున్న రామ్ చరణ్.. అందుకు ఎంతో చింతించేలా చేశాడు శంకర్. చరణ్ కెరీర్లో అత్యధిక సమయం వెచ్చించిన చిత్రమిది. రిలీజ్ ముందు వరకు తన సినిమా గురించి గొప్పగా చెప్పుకున్న శంకర్.. రిలీజ్ తర్వాత మాత్రం లెంగ్త్ ఎక్కువ అయిందని.. కీలక సన్నివేశాలు తీసేయడంతో సినిమా దెబ్బ తిందంటూ సాకులు వెతికే ప్రయత్నం చేశారు. ఐదు గంటల సినిమాను రెండూ ముప్పావు గంటలకు తగ్గించాల్సి వచ్చిందని ఆయన చెప్పుకున్నారు.
ఐతే నిజానికి ‘గేమ్ చేంజర్’ ఒరిజినల్ రన్ టైం శంకర్ చెప్పినట్లు 5 గంటలు కూడా కాదట. ఏకంగా ఏడున్నర గంటలట. ఈ విషయాన్ని ముందు ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేసిన మలయాళ టెక్నీషియన్ షమీర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ముందుగా తన వద్దకు వచ్చిన ఫుటేజ్ ఏడున్నర గంటలని.. దాన్ని తాను ఎంతో కష్టపడి మూడు గంటలకు తగ్గించానని అతను చెప్పాడు. ‘గేమ్ చేంజర్’ కోసం ఏకంగా తాను మూడేళ్ల పాటు కష్టపడ్డానని.. కానీ ఎంతకీ సినిమా ముగియకపోవడంతో తర్వాత తప్పుకున్నానని అతను చెప్పాడు.
శంకర్ లాంటి పెద్ద దర్శకుడితో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషించానని.. కానీ ఆయనతో ఆశించిన మంచి అనుభవాన్ని పొందలేకపోయానని షమీర్ తెలిపాడు. ఐదు గంటల ఫుటేజ్ అంటేనే జనం బెంబేలెత్తిపోయారు. అలాంటిది ఏడున్నర గంటల సినిమా తీసి.. దాన్ని మూడు గంటల లోపు రన్ టైంకి తగ్గించారంటే ఇంకేం మాట్లాడగలం? దీన్ని బట్టే శంకర్ ప్లానింగ్ ఎంత పేలవంగా సాగిందన్నది అర్థమైపోతుంది. ‘గేమ్ చేంజర్’ డిజాస్టర్ కావడానికి కారణమేంటో ఇక వేరే చెప్పాలా?