సినీ పరిశ్రమతో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, `అదుర్స్` విలన్ ముకుల్ దేవ్ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 54 ఏళ్లకే ముకుల్ దేవ్ మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు సెలబ్రిటీలు ముకుల్ దేవ్ మరణం పై సంతాపం తెలుపుతున్నారు.
1970లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిన హరి దేవ్ కౌశల్, అనూప్ కౌశల్ దంపతులకు ఢిల్లీలో ముకుల్ దేవ్ జన్మించారు. ముకుల్ శిక్షణ పొందిన పైలట్. అయితే నటనపై ఉన్న ఆసక్తితో ఆయన ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. 1996లో విశ్వ సుందరి సుస్మితసేన్‌కు జంటగా `దస్తక్` అనే హిందీ చిత్రంతో హీరోగా ముకుల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హిందీలోనే కాకుండా దక్షిణాది భాషల్లోనూ యాక్ట్ చేశారు.
తెలుగు ప్రేక్షకులకు కూడా ముకుల్ దేవ్ సుపరిచితుడే. 2008లో వచ్చిన రవితేజ `కృష్ణ` మూవీతో ప్రతినాయకుడిగా ముకుల్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత `ఏక్ నిరంజన్`, `సిద్ధం`, `అదుర్స్`, `కేడి`, `బెజవాడ`, `మనీ మనీ మోర్ మనీ`, `నిప్పు`, `భాయ్` వంటి చిత్రాల్లో ముకుల్ దేవ్ విలన్ గా అలరించారు. 2022 నుంచి ముకుల్ దేవ్ వెండితెరపై కనిపించలేదు. తల్లిదండ్రుల మరణంతో గత కొన్నేళ్ల నుంచి ఒంటరిగా ఉంటున్న ముకుల్.. అనారోగ్యం బారిన పడి మరణించారు. కాగా, ప్రముఖ నటుడు రాహూల్ దేవ్ కు ముకుల్ దేవ్ స్వయానా సోదరుడు.