భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు

admin
Published by Admin — May 22, 2025 in Movies
News Image

సోష‌ల్ మీడియా వ‌ల్ల సినిమాల‌కు ఎంత ప్ర‌మోష‌న్ ప‌రంగా ఎంత ప్ర‌యోజ‌నం ఉంటుంటో.. అంతే చేటు కూడా జ‌రుగుతుంది. ఏదో ఒక వ‌ర్గం మ‌నోభావాలను దెబ్బ తీసేలా ఏదైనా చిత్ర బృందంలోని వాళ్లు వ్య‌వ‌హ‌రిస్తే బాయ్ కాట్ ఉద్య‌మాలు మొద‌లైపోతాయి. సినిమాను దారుణంగా టార్గెట్ చేస్తారు. ఇప్పుడు భైర‌వం అనే కొత్త సినిమాకు ఇదే స‌మ‌స్య త‌లెత్తింది.

ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో ప‌రోక్షంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పొగిడాడంటూ వైసీపీ ఫ్యాన్స్ అత‌ణ్ని టార్గెట్ చేయ‌డం తెలిసిందే. ఇది చాల‌ద‌న్న‌ట్లు ఇప్పుడు మెగా అభిమానులే అత‌ణ్ని ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఇందుక్కార‌ణం 2011 నాటి ఫేస్ బుక్ పోస్టు. విజ‌య్ ఫేస్ బుక్ పేజీలోని ఆ పోస్టులో చిరంజీవి-రామ్ చ‌ర‌ణ్‌ల ఫొటోలు మార్ఫ్ చేసి పా సినిమా త‌ర‌హాలో పోస్ట‌ర్ త‌యారు చేశారు. దానికి ‘సామాజిక న్యాయం స‌మ‌ర్పించు ఛా’ అనే క్యాప్ష‌న్ పెట్టారు.

ఈ పోస్టును ఎవ‌రో బ‌య‌టికి తీసి వైరల్ చేస్తున్నారు. దీంతో విజ‌య్ మెగా అభిమానుల‌కు టార్గెట్ అయిపోయాడు. ఈ వివాదం మీద వెంట‌నే విజ‌య్ కూడా స్పందించాడు. తాను కూడా మెగా అభిమానినే అని.. త‌న‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా మెగా అభిమానులంద‌రితో మంచి సంబంధాలున్నాయ‌ని చెప్పాడు. ఈ పోస్టు ఎవ‌రో హ్యాక్ చేసి పెట్టింద‌న్న విజ‌య్.. అందుకు బాధ్య‌త వ‌హిస్తూ క్ష‌మాప‌ణ కూడా చెప్పాడు.

ఆ పోస్టులో విజ‌య్ ఇంకా ఏమ‌న్నాడంటే..

”మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది. దానికి ముందు నుంచి కూడా మెగా అభిమానుల నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నారు. కానీ ఈ రోజు నాకు తెలియకుండా ఒక 30 మినిట్స్ నుంచి మెగా అభిమానుల వైపు నుంచి కూడా ట్రోల్ జరుగుతున్నట్టు తెలిసింది. ఎప్పుడో 2011లో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టానని ట్రోల్ చేస్తున్నారు.

అది నేను పెట్టిన పోస్ట్ కాదు.. ఏదో జరిగింది.. హ్యాక్ అయి ఉంటుంది. నేను అందరు హీరోలతో పని చేశాను.. ఎక్కువ పని చేసింది మెగా హీరోలతోనే. మెగా హీరోలు అందరితోనూ నాకు సానిహిత్యం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు నేను పని చేశాను. అప్పుడు నన్ను కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ గారిని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు. అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి.

అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు చూసి, పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను డైరెక్టర్ అవుదామని..! అటువంటిది నేనెందుకు వాళ్లను దూరం చేసుకుంటాను.. అలాంటి తప్పు ఎందుకు చేస్తాను..? నా సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయింది.. తెలిసో తెలియకో జరిగింది.. అది హ్యాక్ అయింది.. అయినా కూడా నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకొకసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను.. ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను.

ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు.. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు.. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు మెగా అభిమానులు అందరికీ.. మీలో ఒకడిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను” అని విజ‌య్ పేర్కొన్నాడు.

Tags
apologies bhairavam director vijay kanakamedala bhairavam movie
Recent Comments
Leave a Comment

Related News