గత కొన్నేళ్ల నుంచి సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ఆచి తూచి సినిమాలు చేస్తుంది. 2020లో `నిశ్శబ్దం`, 2023లో `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` సినిమాలతో పలకరించిన అనుష్క.. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో `ఘాటి` అనే సినిమా చేస్తోంది. ఇదొక క్రైమ్ యాక్షన్ డ్రామా. ఈ చిత్రంలో మునుపెప్పుడూ కనిపించనంత వైల్డ్ క్యారెక్టర్ లో అనుష్క యాక్ట్ చేసింది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాశాయి.
అనుష్క అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఘాటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ 18న సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో దర్శకనిర్మాతలు రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. జూన్ లో ఘాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ మొదట భావించినప్పటికీ.. సోలో రిలీజ్ దొరక్కపోవడంతో జూలై రెండో వారానికి రిలీజ్ డేట్ ను షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట.
జూన్ నెలలో పెద్ద పెద్ద సినిమాలన్నీ థియేటర్స్ కు క్యూ కట్టాయి. జూన్ మొదటి వారంలో కమల్ హాసన్-శింబు ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కించిన `థగ్ లైఫ్` విడుదల కానుంది. అలాగే రెండో వారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `హరి హర వీరమల్లు`, మూడో వారంలో ధనుష్ `కుబేర`, నాలుగో వారంలో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప` చిత్రాలు వరుసగా రిలీజ్ కు రెడీ అయ్యాయి.
అలాగే జూలై మొదటి వారంలో విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన `కింగ్‌డమ్` సినిమా విడుదల కానుంది. ఇక జూలై రెండో వారంలో స్లాట్ ఖాళీగా ఉంది. సోలో రిలీజ్ కి అనుకూలంగా ఉంటుంది. మరి జూలై రెండో వారంలో అయిన ఘాటికి మోక్షం లభించేనా? లేదా? అన్నది చూడాలి. కాగా, ఘాటి చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యెదుగురు రాజీవ్ రెడ్డి మరియు సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. విక్రమ్ ప్రభు, రమ్య కృష్ణ, జగపతి బాబు తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.