రాజకీయాల్లో ఉన్నవారు.. ఏం మాట్లాడినా చెల్లుతుందనే రోజులు పోయాయి. ప్రజలు కూడా ఏం చెప్పినా వినేస్తారని.. ఏం చేసినా.. నమ్మేస్తారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఎవరినీ దాచి పెట్టదు. గత, ప్రస్తుత విషయాలను జోడించి నాయకుల బండారాలను బయట పెట్టేస్తోంది. దీంతో మనం ఏం చేసినా ప్రజలు విశ్వసిస్తారు.. అదే నిజమని నమ్మేస్తారని అనుకుంటే భ్రమే. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తోందని.. ఏడాది కాలంలోనే లక్షా 50 వేల కోట్ల అప్పు చేసింద ని.. జగన్ కన్నీరుపెట్టుకున్నంత పనిచేశారు. దీనివల్ల రేపు ప్రజలపై భారాలు పడతాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఆ బాధ ఉండొచ్చు.. తప్పుకాదు. కానీ... అధికారంలో ఉండగా.. అంటే.. పట్టుమని 12 మాసాల కిందటి వరకు జగన్ చేసింది ఏంటి? అని తరచి చూస్తే.. అప్పు చేయని రోజు లేదు. అప్పుతీసుకురాని రంగం కూడా లేదు.
చివరకు 25 ఏళ్లపాటు మందు బాబులు తాగే మద్యంపై కూడా అప్పు తెచ్చారు. చెత్తపై పన్ను విధిస్తే.. రూ.2000 కోట్లు వడ్డీలేని అప్పుగా ఇస్తామంటే.. కేంద్రం నుంచి దానిని కూడా తీసుకున్నారు. రైతులు వినియోగించే విద్యుత్‌కు స్మార్టు మీటర్లు పెడితే.. రూ.4 వేల కోట్లు అప్పు ఇస్తామని కేంద్రం చెప్పగా.. అన్నదాత కష్టనష్టాలను కూడా బేరీజు వేయకుండానే ఆ అప్పు తెచ్చుకున్నారు.
ఈ విషయాలను ఎవరో చెప్పలేదు.. జగన్‌కు ఎంతో ఇష్టమైన.. అప్పటి బీఆర్ ఎస్ నాయకుడు, మంత్రి హరీష్ రావే చెప్పారు. ``జగన్ లాగా 4 వేలకోట్లకు కేసీఆర్కక్కుర్తి పడలేదు. స్మార్టు మీటర్లు పెట్టలేదు`` అని ఆయన మహబూబ్‌నగర్‌లో రైతులను కలిసినప్పుడు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ... ఇప్పుడు జగన్ అప్పుల గురించి మాట్లాడుతున్నారు. గుండెలు బాదుకుంటున్నారు. అయితే.. ఆయన మాటలు ఎవరు మాత్రం వింటారు?
ఇక, రాజ్యాంగ విలువ గురించి జగన్ మాట్లాడుతున్నారు. అరాచకాలు.. అక్రమ కేసులు పెరిగాయని చెబుతున్నారు. కానీ.. ఒక్కసారి తన పాలన గురించి కూడా ఆత్మావలోకనం చేసుకుంటే.. ఖచ్చితంగా అప్పట్లో ఏం జరిగిందో తెలుస్తుంది. మచ్చుకు కొన్ని.. ప్రజలే గుర్తు చేస్తున్న సంగతులు..
1) రాజధాని విషయంలో జగన్‌పై యాంటీపోస్టును ఫార్వర్డ్ చేశారన్న కారణంగా 70 ఏళ్ల రంగనాయకమ్మను అర్ధరాత్రి పూట స్టేషన్‌కు పిలిచి విచారించారు.
2) ఎన్-90 మాస్కును అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌పై దాడి చేసి.. నడిరోడ్డుపై పోలీసులో పెడరెక్కలు విరిచి కట్టించి.. అరెస్టు చేయించారు.
3) సొంత ఎంపీ న్యూడ్ వీడియో బయట పడితే.. అది తప్పులేదన్నారు.
4) సొంత ఎమ్మెల్సీ కారు డ్రైవర్ మృత దేహాన్ని డోర్ డెలివరీ చేస్తే.. మిన్నకున్నారు.
5) రాజధానికి చెందిన సీనియర్ జర్నలిస్టు అంకబాబును అర్ధరాత్రి వేళ అరెస్టు చేయించారు.
6) ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు కోరిన ఉద్యోగులపై క్రిమినల్ కేసులు పెట్టించారు.
7) అంగన్ వాడీ కార్యకర్తలు తమ వేతనాలను ఇప్పించమని కోరినందుకు.. పోలీసులతో ఏలూరులో లాఠీ చార్జీ చేయించి.. కేసులు పెట్టించారు.
8) అప్పటి మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడలను కనీసం టాయిలెట్‌కు వెళ్లేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా.. అరెస్టు చేశారు.
9) అప్పటి మాజీ మంత్రి పొంగూరు నారాయణను ఎవరో పదోతరగతి జవాబు పత్రం సోషల్ మీడియాలో పెట్టిన పాపానికి హైదరాబాద్‌లో అరెస్టు చేయించి.. రోడ్డు మార్గంలో కర్నూలుకు తీసుకువచ్చారు. మరి.. ఇవన్నీ.. ప్రజాస్వామ్య ఉద్ధరణకేనా? అనేది ప్రజల ప్రశ్న.