వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సోదరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య గ్యాప్ వచ్చాక వైఎస్ విజయమ్మ కూతురు వైపే నిలబడ్డారు. ఆ తర్వాత జగన్ ఓడిపోవడం, అధికారాన్ని కోల్పోవడం తెలిసిందే. కొంతకాలం నుంచి వైఎస్ విజయమ్మ బయట పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా మంచు ఫ్యామిలీతో కలిసి విజయమ్మ దర్శనమిచ్చారు.
మంచు విష్ణు టైటిల్ పాత్రలో మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించిన `కన్నప్ప` నేడు భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు టాప్ స్టార్స్ ఎందరో భాగమైన ఈ చిత్రం తొలి ఆట నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. అయితే హైదరాబాద్ లోని ప్రముఖ ఏఎంబీ సినిమాస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కన్నప్ప స్క్రీనింగ్ కు విజయమ్మ హాజరయ్యారు.
హీరో మంచు విష్ణు, మంచు విరానికా మరియు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి విజయమ్మ కూడా కన్నప్ప సినిమాను వీక్షించారు. గతంలో ఎప్పుడు ఆవిడ థియేటర్స్ కు రావడం, సినిమాలు చూడడం జరగలేదు. కానీ ఫస్ట్ టైమ్ అది కూడా విడుదలైన రోజే విజయమ్మ థియేటర్‌ను వచ్చి కన్నప్ప చిత్రాన్ని వీక్షించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా మంచు విష్ణు సతీమణి విరనికా రెడ్డి వైఎస్ జగన్ కి సోదరి అవుతారు. వైఎస్ రాజారెడ్డి నాలుగో కొడుకు సుధాకర్ రెడ్డి, విద్యా రెడ్డి దంపతుల కుమార్తెనే విరనికా. కుటుంబ బంధం నేపథ్యంలోనే వైఎస్ విజయమ్మ కన్నప్ప స్క్రీనింగ్ కు హాజరయ్యారు.