ఎన్నారై వ్యవహారాలు, సేవలు, పెట్టుబడుల విభాగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా బాధ్యతలను డాక్టర్ రవి వేమూరు శుక్రవారం నాడు స్వీకరించారు. తాడేపల్లిలోని ఏపీఎన్నార్టీఎస్ కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వచనాల నడుమ ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి వేమూరు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా నెంబర్ వన్ గా ఉండాలన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ల లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తానని డాక్టర్ రవి వేమూరు అన్నారు. పలు దేశాలలోని ప్రవాసాంధ్రుల సంక్షేమం, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఏపీ అభివృద్ధిలో, పీ4 కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వాములను చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉద్యోగులుగానే ఉన్న ఎన్నారైలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించామని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాలలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాల కోసం శిక్షణా కార్యక్రమాలు చేపడతామన్నారు.
అమరావతిలో ఎన్నారై ఐకానిక్ టవర్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీనిచ్చారు. ఏపీఎన్ఆర్‌టీ వారధిగా ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకాలు తెస్తామని చెప్పారు. విదేశాల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించేందుకు శ్రీవారి కల్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఎన్నారైల పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీఎన్ఆర్‌టీ కీలక వేదికగా నిలుస్తుంని చెప్పారు.
ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్, టీడీపీ ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు బుచ్చి రాం ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, ఏపీఎన్ఆర్టీ సొసైటీ సీఈవో హేమలత రాణి, ఏపీ ఎన్ఆర్టీఎస్ డైరెక్టర్లు శేషుబాబు కానూరి, శాంతి, ఎన్నారై టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ రవి, ఎన్నారై టీడీపీ కువైట్ విభాగం అధ్యక్షుడు నాగేంద్ర బాబు అక్కిలి, ఓఎస్డీ, ఏపీ ఎన్నార్టీ ప్రెసిడెంట్ డీవీ రావు, డాక్టర్ మురళీ నన్నపనేని, రవి శాఖమూరి, ప్రభాకర్,ఫైనాన్స్ మేనేజర్, ఏపీ ఎన్నార్టీ స్టాఫ్, డాక్టర్ రవి వేమూరు శ్రేయోభిలాషులు, పలువురు ఎన్నారైలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఎన్నారై వ్యవహారాలు, సేవలు, పెట్టుబడుల విభాగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవి వేమూరుకు నమస్తే ఆంధ్ర.కామ్ తరఫున హార్ధిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.