మంచు విష్ణు టైటిల్ పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ ఫాంటసీ డ్రామా `కన్నప్ప`. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మోహన్‌బాబు స్వయంగా రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ నటులతో పాటు బ్రహ్మానందం, మధుబాల, దేవరాజ్, ఐశ్వర్య, ముఖేష్ రిషి తదితరులు కన్నప్పలో భాగం అయ్యారు. స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సంగీతం అందించారు. శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రం నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయింది.
ఇప్పటికే ప్రీమియర్ షోటోలు, మార్నింగ్ షోలు చూసిన ఆడియెన్స్ సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇచ్చేస్తున్నారు. నిజానికి మంచు ఫ్యామిలీ కన్నప్ప సినిమాను అనౌన్స్ చేసినప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఎన్నో ట్రోల్స్ జరిగాయి. వాటన్నిటిని తట్టుకుని మంచు విష్ణు మరియు మోహన్ బాబు ముందడుగు వేశారు. ఫస్ట్ లుక్, టీజర్ బయటకు వచ్చాక నెగెటివిటీ తగ్గుతూ వచ్చింది. ట్రైలర్ రిలీజ్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రభాస్ సినిమాలో యాక్ట్ చేయడంతో కన్నప్ప హైప్ వీక్స్ కు చేరింది.
ఫైనల్ గా నేడు రిలీజ్ అయిన ఈ సినిమాకు మెజారిటీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ లభిస్తుంది. కంప్లీట్‌గా బాగోలేదని ఎవరూ చెప్పడం లేదు. ఫస్టాఫ్‌లో సాగదీత ఎక్కువైంది. విష్ణు పాత్ర పరిచయం, యాక్షన్ సన్నివేశాలు, బీజీఎమ్ తప్ప చెప్పుకోదగ్గ సన్నివేశాలు ఫస్టాఫ్‌లో లేవు. కానీ సెకాండాఫ్‌ను మాత్రం డైరెక్టర్ ఓ రేంజ్‌లో లేపాడు. ప్రభాస్ ఎంట్రీ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. ఆయన పోషించిన రుద్ర పాత్ర గూస్‌బంప్స్ తెప్పింది. ప్రభాస్ ఎంట్రీతో సినిమా మరో స్థాయికి చేరుకుంది.
అలాగే మంచు విష్ణు తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. తిన్నడు నుంచి కన్నప్పగా మారిన క్షణం మెస్మరైజింగ్‌గా అనిపించింది. చివరి ఇరవై నిమిషాలు సినిమాకు ఆయువు పట్టుగా నిలిచాయి. పూర్తిగా భక్తిభావం పెరిగేలా చేస్తూ భావోద్వేగంగా క్లైమాక్స్ ను డైరెక్టర్ అద్భుతంగా ప్లాన్ చేశాడు. బీజీఎమ్, ఎలివేషన్స్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. మోహన్‌లాల్ పాత్ర ఒక పెద్ద సర్‌ప్రైజ్. శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ కనిపించిన తీరు కట్టిపడేసింది. నేటి తరానికి కన్నప్ప గురించి తెలియజేసే ప్రయత్నాన్ని ప్రశంసించకుండా ఉండలేము. ఫైనల్ గా విష్ణు హిట్ కొట్టాడనే చెప్పుకోవచ్చు.