దేశవ్యాప్తంగా కమలం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 14 రాష్ట్రాలకు అధ్యక్షులు నిమిత్తం అయ్యారు. మిగిలిన రాష్ట్రాలకు కూడా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను బీజేపీ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే రోజు అధ్యక్షులను ప్రకటించేందుకు అధిష్టానం సిద్ధమైంది. ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా.. ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి జూలై 1న తేదీన అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలో పార్టీ నూతన అధ్యక్షులను ప్రకటించనున్నారు.
అయితే ఏపీలో ప్రస్తుత బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరినే తిరిగి కొనసాగించాలని కమలం పెద్దలు భావిస్తున్నారట. 2023లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా పాలన సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ చిన్నమ్మనే పార్టీ ప్రెసిడెంట్ చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ బీజేపీకి కొత్త బాస్ అయ్యేందుకు ప్రధానంగా నలుగురు పోటీ పడుతున్నారు. ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ అధ్యక్షుడి పీఠకోసం ఢిల్లీ వేదికగా లాబీయింగ్ చేస్తున్నారట. అలాగే ఇంకొందరు ఈ పదవి రేసులో తాము లేమని పైకి చెబుతున్నా.. లోలోపల మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇక రాష్ట్రంలో పార్టీకి ఊపు తెచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కే తిరిగి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీకి కొత్త బాస్ ఎవరు అన్నది సస్పెన్స్ గా మారిపోయింది.