ప్రస్తుతం భాషల మధ్య హద్దులు పూర్తిగా చెరిగిపోయాయి. నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు వేర్వేరు భాషలకు వెళ్లి సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల మధ్య ఈ ఎక్సేంజ్‌లు బాగా నడుస్తున్నాయి. తమిళ హీరోలు వచ్చి తెలుగులో సినిమాలు చేస్తున్నారు. తెలుగు దర్శకులు, నిర్మాతలు తమిళంలో సినిమాలు తీస్తున్నారు.
ఐతే తమిళ నటులు తెలుగులో సినిమాలు చేసినంతగా.. మన హీరోలు తమిళంలో నటించడం మాత్రం తక్కువే. ఐతే అక్కినేని నాగార్జున ఇద్దరు తమిళ నటులతో ద్విభాషా చిత్రాల్లో నటించారు. అందులో ఒకటి ‘కుబేర’ విడుదలైంది. ఆగస్టులో ‘కూలీ’ విడుదల కాబోతోంది. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని ఓ తమిళ సినిమాలో క్యామియో రోల్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. అతను కార్తి హీరోగా నటించబోయే ఓ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేయనున్నాడట.
కార్తి ఇటీవలే నాని సినిమా ‘హిట్-3’లో క్యామియో రోల్ చేశాడు. అంతే కాక ‘హిట్-4’లో అతనే హీరోగా చేయబోతున్నాడు కూడా. ఇది నాని ప్రొడక్షన్ ఫ్రాంఛైజీ అన్న సంగతి తెలిసిందే. నాని, కార్తి మధ్య ఎప్పట్నుంచో మంచి అనుబంధం ఉంది. సందర్భం వచ్చినపుడల్లా ఒకరి గురించి ఒకరు గొప్పగా మాట్లాడుతుంటారు. ‘హిట్-3’లో కార్తి నటించడం, ‘హిట్-4’లో హీరోగా చేయబోతుండడంతో ఇద్దరి మధ్య అనుబంధం ఇంకా పెరిగింది.
ఈ నేపథ్యంలోనే తన సినిమాలో నానితో క్యామియో రోల్ చేయించాలని కార్తి భావించాడు. తమిళ్ అనే యువ దర్శకుడితో కార్తి ఒక సినిమా చేయబోతున్నాడు. డ్రీమ్ వారియర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇదొక పీరియాడిక్ అడ్వెంచరస్ ఫిలిం అట. కార్తి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఒక స్పెషల్ రోల్ ఉండగా.. దాన్ని నానితో చేయిస్తున్నారట.
నాని ఇంతకుముందు తమిళంలో ‘వెప్పం’ (తెలుగులో సెగ) అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత అతను నటించే తమిళ చిత్రం ఇదే అవుతుంది. ప్రస్తుతం నాని ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.