తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో తప్పుబడుతూ.. ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి వీల్లేదని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. సదరు నిర్ణయానికి అనుగుణంగా కేటాయించిన భూములను కూడా రద్దు చేసింది. దీంతో బీఆర్ ఎస్ హయాంలో చాలా గొప్పగా చెప్పుకొన్న నిర్ణయం.. చేసిన కార్యక్రమానికి సంబంధించిన వ్యవహారం.. వీగిపోయాయి.
ఏం జరిగింది?
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను కీలకంగా తీసుకు న్నారు. దీనిని హైదరాబాద్ సమీపంలోని శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ఏర్పాటు చేయాలని తలపోశారు. అంతేకా దు.. 2021లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ ఎన్వీ రమణను ప్రత్యేకంగా ఆహ్వానించి.. ఇక్కడ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ ను ప్రారంభించారు. ఇదితెలంగాణకు కలికి తురాయిగా మారుతుందని.. అంతర్జాతీయ సంస్థల వివాదాలను చిటికెలోనే పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని అప్పట్లో సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.
అయితే.. ఈ సంస్థకు శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నెంబరు 83/1లో కేటాయించిన మూడున్నర ఎకరాలపై వివాదం చోటు చేసుకుంది. ఈ భూమిని కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది కె.రఘునాథ్‌రావు, వెంకటరామ్‌రెడ్డి వేర్వేరుగా అప్పట్లోనే హైకోర్టుకు వెళ్లారు. ఆయా పిటిషన్లపై అప్పటి నుంచి విచారణ జరిపిన హైకోర్టు ఈ ఏడాది జనవరిలో వాదనలు ముగించింది. తాజాగా శుక్రవారం దీనికి సంబంధించిన తీర్పును వెలువరించింది.
నిబంధనలకు విరుద్ధంగా భూకేయింపు చేశారన్న న్యాయవాది రఘునాథ్ రావు వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఐఏఎంసీ భూకేటాయింపుతో పాటు, ప్రస్తుత భవనం నిర్వహణ కోసం జారీ చేసిన జీఓలను కూడా హైకోర్టు కొట్టేసింది. దీంతో అప్పట్లో కేసీఆర్ తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయం వీగిపోయింది. అయితే..దీనిపై బీఆర్ ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే బలమైన వాదనలు వినిపించడంలో విఫలమైందని అంటున్నారు. కేసీఆర్ కుఎక్కడ పేరు వస్తుందోనన్న దుగ్ధతోనే.. కాంగ్రెస్ ప్రభుత్వం సరైన విధంగా వాదనలు వినిపించలేదని ఆరోపిస్తున్నారు.