`బొమ్మరిల్లు` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారాడు సిద్ధార్థ్. ఆ తర్వాత టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోయాడు. కానీ ఇక్కడ విజయాల కన్నా పరాజయాలే ఎక్కువగా పలకరించడంతో తమిళ బాట పట్టిన సిద్ధార్థ్.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా అక్కడ వరుస సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ టైమ్‌లో `ఇండియన్ 2`, `మిస్ యు`, `టెస్ట్` వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు.
తాజాగా `3 బీహెచ్‌కే` అంటూ ఓ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాతో అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ శరత్ కుమార్, సిద్ధార్థ్ తండ్రీకొడుకులుగా నటించారు. సొంతిల్లు అనేది చాలామంది కల.. ఆ కలను నెరవేర్చుకునేందుకు ఓ మధ్యతరగతి కుటుంబం ఎన్ని కష్టాలు పడిందన్న కథాంశంతో రూపొందిన 3 బీహెచ్‌కే జులై 24న రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా సంగతి పక్కన పెడితే.. రీసెంట్ గా సిద్ధార్థ్ ఓ ఇంటివాడు అయ్యాడు. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కదా.. అదే ఫాలో అయ్యాడు సిద్ధార్థ్. 2024లో ప్రముఖ నటి అదితి రావు హైదరిని ఈయన ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం సిద్ధార్థ్ తన సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకున్నాడు. రెండు నెలల క్రితం సొంత ఇల్లు కొన్నానని తాజాగా `3 బీహెచ్‌కే` ప్రమోషనల్ ఈవెంట్లో సిద్ధార్థ్ స్వయంగా వెల్లడించాడు.
`ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్లు అయింది. నా లైఫ్ లో సగానికి పైగా సినిమాల్లోనే ఉన్నాను. కానీ ఇంతవరకు ఒక్క ప్రాపర్టీ కూడా కొనలేదు. సొంత ఇల్లు కూడా లేదు. కానీ, వివాహం తర్వాత నాకు బాధ్యతలు పెరిగాయి. తెలంగాణ అల్లుడ్ని అయ్యాను. నాకు, అదితికి ఒక కామన్ డ్రీమ్ హౌస్ ఉండాలని భావించి రెండు నెలల క్రితమే సొంత ఇల్లు కొన్నాను. నాకూ ఒక ఇంటి పేరు ఉండాలని, ఆ ఇంటి పేరుతో ఒక ఇల్లు ఉండాలని ఎప్పటినుంచో కల కన్నాను. నా కల పెళ్లి తర్వాతే నెరవేరింది` అంటూ సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.