ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్నాళ్లుగా పెరుగుతున్న విద్యుత్ చార్జీలతో ప్రజలు అల్లాడి పోతు న్నారు. తరచుగా దీనిపై ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. వాడుతున్న కరెంటుకు, వస్తున్న బిల్లులకు సంబంధం లేకపోవడంతో వారు అల్లాడిపోతున్నారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులను వినియోగదారులు నిలదీస్తున్నారు. కర్నూలు, అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ శాఖల కార్యాలయాల వద్ద తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేశారు. బిల్లులు పెంచేయడంపై ధర్నాలు కూడా చేపట్టారు.
అయితే.. ఇలా విద్యుత్ బిల్లులు అమాంతం పెరిగిపోవడం తమ తప్పుకాదని.. జగన్ హయాంలో చేసుకున్న ఒప్పందాలేనని సర్కారు పదే పదే వివరణ ఇస్తూ వచ్చింది. జగన్ హయాంలో విద్యుత్‌ను అడ్డగోలుగా కొనుగోలు చేసుకున్నారని.. అధిక మొత్తాలకు కొన్నారని.. అవసరం లేకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని సర్కారు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. అయినా.. ప్రజల్లో మాత్రం అసంతృప్తి తగ్గడం లేదు. నానాటికీ పెరుగుతున్న విద్యుత్ భారాలతో వారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కొందరైతే.. జగన్ విద్యుత్ చార్జీలను పెంచి తమను ఇబ్బంది పెట్టడంతోనే ఆయనను ఓడించామనికూడా చెప్పుకొచ్చారు.
ఇలా రాష్ట్రంలో గత మూడు మాసాల నుంచి ప్రజల్లో విద్యుత్ చార్జీల పట్ల తీవ్ర వ్యతిరేకత, నిరసనలు కూడా వ్యక్తమవుతున్నా యి. ఇలాంటి సమయంలో అనూహ్యమైన ప్రకటన వచ్చింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచేది లేదన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ప్రజలపై భారాలను మోపబో మని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల నాటికి విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని.. ఈ దిశగా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని కూడా మంత్రి వివరించారు. దీంతో ప్రజలపై పడుతున్న భారాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్న విషయాన్ని మంత్రి చెప్పుకొచ్చారు.