ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గురువారం రాజమండ్రిలో నిర్వహించిన అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఓ కీలక ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం లేదని.. దీనికి కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ అడ్డు పడ్డారని.. ఆంధ్రుల తరఫున ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నానని కూడా పవన్ కల్యాణ్ అన్నారు. వాస్తవానికి.. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరూ చెప్పకపోవడం.. పైగా తనకు సంబంధం లేని ఉక్కు శాఖకు సంబంధించిన విషయంపై పవన్ కల్యాణ్ ప్రకటన చేయడంతో సామాజిక మాధ్యమాల్లో కొన్ని పెదవి విరుపులు కనిపించాయి.
వాస్తవానికి మూడేళ్లుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది. దీనిని ప్రైవేటీకరించేందుకు మోడీ సర్కారు నడుంబిగించిందన్న వార్తలు, విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాదు.. పలుమార్లు పార్లమెంటులో కూడా.. కేంద్రం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే.. గత ఏడాది రాష్ట్రంలో కూటమి ప్రబుత్వం ఏర్పడిన తర్వాత.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు అధికారికంగా ఢిల్లీకి పలుమార్లు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కుపై కీలక ప్రతిపాదనలు చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కుకు సంబంధించి 11400 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది.
ఇది అక్కడితో అయిపోయింది. అయినా.. ఈ సొమ్ములపై కూడా అనే సందేహాలు వచ్చాయి. ఈ నిధులను ఉక్కు ఫ్యాక్టరీ అప్పులకు చెల్లించవద్దని.. సొమ్ముతో డెవలప్ చేయొద్దని నిబంధనలు పెట్టినట్టు కొందరు ఉద్యోగులు కూడా చెప్పారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల నిరసన కూడా కొనసాగింది. ఇక, కాంగ్రెస్ పార్టీఏపీ చీఫ్ షర్మిల కూడా ఉక్కు ఫ్యాక్టరీ వద్ద ఉందోళన చేసిన విషయం తెలిసిందే. ఇలా.. ఉక్కు ఫ్యాక్టరీ విషయంపై ఇంకా సందేహాలు ముసురుకున్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి గురువారం కీలక వార్త చెప్పారు. అయితే.. గతంతో పోల్చుకున్నప్పుడు.. ఆయన చెప్పిన మాటపై సహజంగానే సందేహాలు ఉంటాయి.
కానీ.. ఈ సందేహాలకు తెర దించుతూ.. పవన్ చెప్పిన మాట నిజమేనని రుజువు చేస్తూ.. సుదీర్ఘకాలంగా ఆగిపోయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలోని మూడో ఫర్నేజ్‌లో శుక్రవారం నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తిని ప్రారంభించారు. ఇది ఉద్యోగులకు పండుగ లాంటి వార్తను మోసుకువచ్చింది. ఇప్పటికే రెండు ఫర్నేజ్‌లలో ఉత్పత్తి సాగుతోంది. మూడో ఫర్నేజ్‌లో మాత్రం ఉత్పత్తిని చాలా కాలం కిందటే ఆపేశారు. దీనికి కారణం ప్రైవేటీకరణేనన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో శుక్రవారం మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌ను పునఃప్రారంభించడంతో పవన్ చెప్పింది నిజమేనని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్‌ను ప్రారంభించడం వల్ల ప్రస్తుతం ఉన్న రెండింటితో కలిపి రోజుకు 21,000 టన్నుల ఉత్పత్తి జరుగుతుంది.