టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఏకంగా రూ. 200 కోట్లు విలువ చేసే రెండు ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక హైదరాబాద్ మహానగరంలో ప్రకృతి వనరుల పరిరక్షణకు, అక్రమణల అడ్డుకట్టకు హైడ్రాను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అన్యాయంగా ఆక్రమించుకొని చెరువుల్లో చేపట్టిన చాలా నిర్మాణాలను ఇటీవల హైడ్రా తొలగించింది
అందులో భాగంగానే మాదాపూర్ ఏరియాలో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా ఆగస్టులో ఓ తెల్లవారుజామున హైడ్రా కూల్చి వేసింది. అప్పట్లో ఈ న్యూస్ పెను సంచలనం రేపింది. అయితే ఈ అంశంపై నాగ్ నుంచి ఎటువంటి వ్యతిరేక ప్రకటనలు రాలేదు. న్యాయపోరాటం చేస్తామన్నారు. కానీ ప్రభుత్వంతో ఎలాంటి వైరం పెంచుకోలేదు. రేవంత్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల కుమారుడు అఖిల్ వివాహానికీ ఆహ్వానించారు.
పైగా ఆ భూమిని కూడా ప్రభుత్వానికే అప్పగించారని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో స్పష్టమైంది. పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునపై ప్రశంసలు కురిపించారు. హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసిన కూడా తమ్మిడికుంట చెరువు కోసం నాగార్జున స్వచ్ఛందంగా రెండు ఎకరాల స్థలం ఇచ్చి రియల్ హీరో అనిపించుకున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా, మాదాపూర్‌లో ఎకరం దాదాపు వంద కోట్లు ఉంటుంది. అంటే రూ. 200 కోట్లు విలువ చేసే స్థలాన్ని నాగ్ ప్రభుత్వానికి ఇచ్చేశాడు. ఇందుకు కారణం లేకపోలేదు. ఎన్ కన్వెన్షన్ చెరువు మధ్యలో ఉంటుందన్న సంగతి అందకీ తెలుసు. దీని చుట్టూ ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి. చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారనే మరక నాగ్‌పై ఉంది. ఇప్పుడు చెరువు స్థలం ప్రభుత్వానికి అప్పగించడంతో నాగార్జునపై ఆ మరక పోయినట్లైంది.