ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇటీవలె ఏడాది పాలన పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటికీ కూడా కొందరు ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారికి తాజాగా అటు సీఎం చంద్రబాబుతో పాటు ఇటు మంత్రి నారా లోకేష్ స్ట్రైట్ మార్నింగ్ ఇచ్చారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేస్తామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, కేంద్రం సహకారంతో మరో ఏడాదిన్నర కాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
అలాగే రాష్ట్రంలో వ్యవస్థను గాడిలో పెడుతూ.. టీడీపీ జనసేన బీజేపీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని, అలాగే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలకు బాబు వార్నింగ్ ఇచ్చారు. అది మన బాధ్యత అన్నారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని.. భవిష్యత్తులో ఏం చేస్తామో కూడా స్పష్టంగా చెప్పాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అదేవిధంగా `సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికీ తెలుగుదేశం` పేరుతో నెల రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని బాబు ఆదేశించారు.
ఇదే ఇదే సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 151 సీట్లు గెలిచిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైందంటే అందుకు ప్రధాన కారణం వారి అహంకారమే అని.. ఆ తప్పు మనం చేయకూడదన్నారు. అధికారం చేతికి వచ్చిందన్న అలసత్వం ప్రదర్శించవద్దని, నిరంతరం ప్రజలతో మమేకమవ్వాలి. వారి కష్టసుఖాలు తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులను లోకేష్ హెచ్చరించారు.