రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి పప్పు అన్న పేరు పెట్టింది వైసీపీనే. 2014 నుంచి అదే పేరుతో పిలుస్తూ సెటైర్లు పేలుస్తూ లోకేష్ ను ఎద్దేవా చేసేవారు. ఇప్పుడు వారే లోకేష్ ఎదుగుదలను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటువంటి సమయంలో జగన్ వంటి నాయకుడు మళ్ళీ అదే పేరుతో లోకేష్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను వేలిత్తి చూపుతూ ఎక్స్ వేదికగా జగన్ ఘాటు విమర్శలు గుప్పించారు.
`రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గత నెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు` అంటూ జగన్ ట్వీట్ చేశారు.
విపక్ష నేతగా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ చివర్లో పప్పూ నిద్ర వదులు అంటూ లోకేష్ ను పనిగట్టుకుని జగన్ కెలకడం ఆయన స్థాయికి తగదని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక జగన్ రెచ్చగొట్టాక లోకేష్ ఊరుకుంటారా.. వెంటనే కౌంటర్ ఎటాక్ చేశారు. కాకపోతే జగన్ మాదిరిగా కాకుండా చాలా హుందాగా లోకేష్ సమాధానం ఇచ్చాడు. `మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ గారు! మీరు ఐదేళ్లు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయారు. నేను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి మీకు కడుపుమంట రావడం సహజం.
మీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా మీకు స్పృహ లేదు. కోవిడ్ తరువాత మీరు 2022 సెప్టెంబర్లో, 2023 జూలై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన మీరు మమ్మల్ని విమర్శించటం మీ అజ్ఞానానికి నిదర్శనం. మేము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్ని జూలై మూడో వారం కల్లా పూర్తి చేసాము. ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్ని జూలై మూడో వారానికి పూర్తి చేస్తాము` అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.