ఏపీ రాజధాని అమరావతి లో మరోసారి భూ సమీకరణకు ప్రభుత్వం రెడీ అయింది. వాస్తవానికి ఇప్పటికే దీనిపై కార్యాచరణను పూర్తి చేసిన సర్కారు తాజాగా కేబినెట్ భేటీలో చర్చించి.. ఆమోద ముద్ర వేసింది. తద్వారా రేపు న్యాయపరమైన, రాజకీయ పరమైన ఇబ్బందులకు అవకాశం లేకుండా చూసుకునేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం.. ఇప్పటికే సమీకరించిన(ల్యాండ్ పూలింగ్) 34.25 వేల ఎకరాల భూములకు తోడు.. మరో 44.21 వేల ఎకరాలను సేకరించనున్నారు. ఈ భూములను అమరావతి మౌలిక సదుపాయాలకు వినియోగించనున్నారు.
ఈ మేరకు తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అయితే.. రైతులకు ఎలాంటి నష్టం లేకుండా.. గతంలో ఎలా అయితే.. రైతుల నుంచి తీసుకున్నారో.. అచ్చంగా అలానే భూములు తీసుకుంటారు. అప్పట్లో ఎలాంటి నిబంధన మేరకురైతులకు హామీలు ఇచ్చారో.. ఇప్పుడు 44 వేల ఎకరాల సమీకరణ విషయంలోనూ అదే విధానంపాటించనున్నారు. తద్వారా రైతుల ఆందోళనలకు అవకాశం లేకుండా కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. అలానే.. గతంలో భూములు తీసుకున్న రైతులకు త్వరలోనే కమర్షియల్(వాణిజ్య) ఫ్లాట్లను కేటాయించేందుకు కూడా కేబినెట్ నిర్ణయించింది.
ఫలితంగా రాజధాని రైతులకు మేలు చేసేలా చంద్రబాబు సర్కారు శుభవార్త చెప్పిందనే అనాలి. ప్రస్తుతం ఇక్కడ 44 వేల ఎకరాలను సమీకరించడం ద్వారా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. అలాగే.. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు.. ఇతర అవసరాలకు ఈ భూములను వినియోగించనున్నారు. కాగా.. ఈ వ్యవహారంపై కొన్నాళ్ల కిందట వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేసి.. అనుకూల మీడియాలో వ్యతిరేక వార్తలు రాయించారు.
దీంతో రాజధాని రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ పరిణామాలను నిశితంగా గమనించిన సర్కారు.. తాజాగా కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకుని.. రైతులకుఎలాంటి నష్టం లేకుండా.. భూ సమీకరణ చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఫలితంగా రాజధాని రైతులకు ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా.. సర్కారు వెన్నుదన్నుగా ఉండనుంది.