ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం.. రైతులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం పేరిట ప్రతి ఏడాది రైతులకు రూ. 6000 నగదును మూడు విధాలుగా జమ చేస్తుంది. ఈ రూ. 6 వేలకు జతగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 14 వేలు కలిపి మొత్తం రూ. 20 వేలు ప్రతి ఏడాది రైతులకు అందిస్తామని ఎన్నికల టైమ్‌లో హామీ ఇచ్చారు.
అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం జూన్ 20న పీఎం కిసాన్ యోజన 20వ విడత నిధులు విడుదల చేయాల్సి ఉంది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నగదు రూ.5000 కలిపి.. రూ.7 వేలను తొలి విడతగా రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించింది.
కానీ, ఈ నెల 20న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ ఇన్‌స్టాల్‌మెంట్ నిధులు రిలీజ్ అవ్వలేదు. దాంతో ఏపీ సర్కార్ కూడా అన్నదాత సుఖీభవ నిధుల విడుదలను వాయిదా వేసింది. ఇందుకు రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈనెల చివరి నాటికి అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నగదును రైతులకు అందేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45.71 లక్షల రైతు కుటుంబాలు ఈ పథకాల ద్వారా లబ్దీ పొందనున్నారు. రెండో విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 5వేలు, కేంద్రం రూ. 2వేలు కలిపి రూ. 7వేలు అక్టోబరులో, మూడో విడతగా రాష్ట్రం రూ.4వేలు, కేంద్రం రూ.2వేలు కలిపి రూ.6 వేలను వచ్చే ఏడాది జనవరిలో పంపిణీ చేయనున్నారు.