వైసీపీలో ఫ్రైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా పొలిటికల్ కెరీర్ ప్రస్తుతం ప్రమాదంలో పడింది. నగరి నియోజకవర్గంలో రోజా చాప్టర్ క్లోజ్ అయినట్లేనా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓవైపు రోజాను, మరోవైపు కూటమి ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో పెద్దిరెడ్డి పెద్ద ప్లాన్ వేశారు. నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ ను పెద్దిరెడ్డి వైసీపీలోకి తీసుకొస్తున్నారు. గాలి జగదీష్ వైసీపీ చేరిక దాదాపు ఖరారు అయింది. బుధవారం జగన్ సమక్షంలో గాలి జగదీష్ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. టీడీపీలో సీనియర్ నేత, దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గాలి భాను ప్రకాష్ కాగా.. రెండోవాడు గాలి జగదీష్. ముద్దుకృష్ణమనాయుడు అకాల మరణంతో భాను ప్రకాష్, జగదీష్ రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో టీడీపీ టికెట్ కోసం అన్నదమ్ములిద్దరూ పోటీ పడగా.. చంద్రబాబు నాయుడు భాను ప్రకాష్ వైపు మొగ్గు చూపారు. అయితే ఆ ఎన్నికల్లో రోజా చేతుల్లో భాను ప్రకాష్ ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన పార్టీ బలోపేతంలో కృషి చేశారు. 2024 ఎన్నికల్లో మరోసారి టీడీపీ టికెట్ కోసం భాను ప్రకాష్, జగదీష్ పోటీ పడగా.. అప్పుడు కూడా చంద్రబాబు అన్నకే టికెట్ ఇచ్చారు. గత ఎన్నికల్లో రోజాపై భారీ మెజారిటీతో నగరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన భాను ప్రకాష్.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే సమయంలో సోదరుడు జగదీష్ తో భాను ప్రకాష్ కు ఉన్న విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇదే విషయాన్నే క్యాష్ చేసుకున్న పెద్దిరెడ్డి.. జగదీష్ ను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు బలంగా చక్రం తిప్పారని ప్రచారం సాగుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో నగరి టికెట్ పై అధినేత జగన్ నుంచి హామీ రావడంతో.. జగదీష్ కూడా వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్లు టాక్ నడుస్తోంది. నగరి నియోజకవర్గంలో రోజా ప్రభావం తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెను దూరం పెట్టి జగదీష్ కు బాధ్యతలు అప్పజెప్పే యోచనతోనే జగన్ ఉన్నారని సమాచారం. ఏదేమైనా గాలి జగదీష్ వైసీపీలో చేరితే నగరిలో రోజా చాప్టర్ క్లోజ్ అన్న ప్రచారం పార్టీ శ్రేణుల్లో ఊపందుకుంది.