ఏపీలో నేడు ఇంట్రెస్టింగ్ సీన్ చోటు చేసుకోబోతుంది. గత ఏడాది రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నుంచి వలసల పర్వం ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఎంపీల స్థాయి నుంచి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వరకు వరుసగా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తూ కూటమి పార్టీలో చేరిపోతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు ఓ టీడీపీ సీనియర్ నేత.
ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యం నేడు వైసీపీ గూటికి చేరబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 1:30 గంటలకు జగన్ సమక్షంలో సుగవాసి బాలసుబ్రమణ్యం ఆ పార్టీ కండువ కప్పుకోనున్నారు.
అన్నమయ్య జిల్లాలో గత నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో సొగవాసి కుటుంబం క్రియాశీలకంగా వ్యవహరించింది. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తండ్రి సుగవాసి పాలకొండ్రాయుడు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. ఆయన తర్వాత పాలిటిక్స్ యాక్టివ్ అయిన బాలసుబ్రమణ్యం ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, జడ్పీటీసీ సభ్యుడిగా సేవలందించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి బాలసుబ్రహ్మణ్యం.. వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు.
అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. కానీ తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కకపోవడం, అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రాజుకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడంపై బాలసుబ్రహ్మణ్యం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు తన తండ్రి, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు చనిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కనీసం ఒక్కరు కూడా అంత్యక్రియలకు హాజరు కాకపోవడం బాలసుబ్రహ్మణ్యం జీర్ణయించుకోలేకపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సుగవాసి బాలసుబ్రమణ్యం పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు టాక్.