ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ విధ్వంసకర పాలన వల్ల గత ఐదేళ్ల కాలంలో అమరావతికి తీరని నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని పూడ్చుకుంటూ అమరావతి నిర్మాణ పనులను మెరుపు వేగంతో కొనసాగిస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే తాజాగా అమరావతి రాజధాని కోసం రెండో విడత భూసేకరణ చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అమరావతి పరిధిలో మరో 44 వేల ఎకరాల భూ సేకరణకు చంద్రబాబు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
సీఆర్డీఏ పరిధిలో కొత్తగా తీసుకునే భూముల్లో ప్రభుత్వానికి సంబంధించి 2019కు ముందు ఆరేళ్ల అనుభవదారు ఎవరు ఉంటే వారికే నష్టపరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు సమావేశాలు ఏర్పాటు చేయాలని, పథకాల అమలు తీరు గురించి ప్రజలకు వివరించాలని అన్నారు. జూలై 1 లోపు ఈ సమావేశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జూలై 1 నుంచి ఏడాది పాలనపై ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి వివరించాలని అన్నారు.
బనకచర్ల ప్రాజెక్టు గురించి తెలంగాణ నేతలు మాట్లాడుతున్నారని, ఏపీ నేతలు కూడా మన వాదనలు వినిపించాలని అన్నారు. తెలంగాణ వాళ్లు అనుమతి లేని ప్రాజెక్టులను కడుతున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. తెలంగాణ వాడుకుని మిగిలిన నీటినే ఏపీ వాడుకుంటోందని చంద్రబాబు చెప్పారు. బనకచర్లపై తెలంగాణ నేతలు రాజకీయం చేస్తున్నారని, ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని సూచించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై దశలవారీగా ముందుకు పోతామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.