వైసీపీ హయాంలో సీఐడీ మాజీ అదనపు డీజీపీ పీవీ సునీల్ కుమార్…జగన్ చెప్పిందల్లా చేసి స్వామి భక్తి చాటుకున్న సంగతి తెలిసిందే. అప్పటి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను కస్టోడియల్ టార్చర్ చేశారని సునీల్ కుమార్ పై ఆరోపణలున్నాయి. దాంతోపాటు, ప్రభుత్వం నుండి సరైన అనుమతులు లేకుండానే పలు విదేశీ పర్యటనలు చేశారని సునీల్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా సునీల్ కుమార్ ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కండక్ట్ ను సునీల్ కుమార్ ఉల్లంఘించడంతో ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. అంతేకాదు, సునీల్ కుమార్ విదేశీ పర్యటనలపై విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది.
2024 ఫిబ్రవరి లో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకొని దుబాయ్ లో సునీల్ కుమార్ పర్యటించారు. 2023 సెప్టెంబర్ 2న ప్రభుత్వం అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం EK 525 లో హైదరాబాద్ నుండి స్వీడన్ వెళ్లి 2023 సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానం EK 526 లో హైదరాబాద్ తిరిగివచ్చారు.
ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా 2023 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నుండి EK 525 విమానం లో దుబాయి మీదగా అమెరికా వెళ్లి 2023 ఫిబ్రవరి 28 న EK 524 విమానం లో అమెరికా నుండి హైదరాబాద్ కు దుబాయ్ మీదుగా తిరిగి వచ్చారు. అదేవిధంగా, డిసెంబర్ 14 2022 నుండి డిసెంబర్ 19 2022 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్ లో పర్యటించారు.
ప్రభుత్వం అనుమతి లేకుండా 2021 అక్టోబర్ 2న EK 525 విమానంలో హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లి అక్టోబర్ 10 న EK 524 విమానంలో తిరిగి హైదరాబాద్ వచ్చారు. 21 డిసెంబర్ 2019 నుండి 4 జనవరి 2020 వరకు అమెరికా టూర్ కు పర్మిషన్ తీసుకొని యునైటెడ్ కింగ్డమ్ లో పర్యటించారు.