సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉండగా నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడిన పోసాని ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. అయితే, తన ఆరోగ్యం బాగోలేదని పోసాని కొత్త డ్రామాకు తెర తీశారు. ఈ క్రమంలోనే పోసానికి సినీ నటి పూనమ్ కౌర్ సంఘీభావం ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక, పోసాని ఆరోగ్య పరిస్థితి చూసి పూనమ్ ఆందోళన చెందుతోందట. బలహీనులను అరెస్ట్ చేసి పగ తీర్చుకుంటున్నారని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చేసింది. ఇక, గతంలో పోసాని తన గురించి పరోక్షంగా పలుమార్లు మాట్లాడారని, అప్పుడు తాను బాధపడ్డానని అంగీకరించింది. కానీ, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని పూనమ్ ఆకాంక్షించింది.
టాలీవుడ్ లో క్యాస్ట్ ఫీలింగ్, పవన్ కల్యాణ్ ను విమర్శించేటపుడు పోసాని పరోక్షంగా పూనమ్ కౌర్ గురించి కూడా విమర్శలు చేశారు. కానీ, పూనమ్ ఆ కామెంట్లను క్షమించేసింది. పోసాని చేసిన జుగుప్సాకరమైన కామెంట్లు విని కూడా ఆయనను పూనమ్ ఎలా సమర్ధిస్తోందో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఏపీలో వైసీపీ పాలనలో ఉన్న దారుణ పరిస్థితులు…డాక్టర్ సుధాకర్ అరెస్టు..సినిమా టికెట్ల రేట్లు, స్పెషల్ షోలు వంటి విషయాలపై పూనమ్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు.
పోసానికి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, బెయిల్ కోసం ఆయన డ్రామా ఆడినట్టు అర్థమైందని రైల్వే కోడూరు సీఐ వెల్లడించడం షాకింగ్ గా మారింది. అనారోగ్యం అంటూ పోసాని ఆస్కార్ లెవల్లో నటించిన విషయం తెలుసుకోకుండా పూనమ్ తెగ బాధపడిపోతోందని, పోసానిని మించిన మహా నటి పూనమ్ అని సెటైర్లు వేస్తున్నారు.