తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ 69వ చిత్రం `జన నాయగన్`. హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. బాబీ డియోల్, మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న జన నాయగన్ 2026 జనవరి 9న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా విజయ్ బర్త్‌డే సందర్భంగా `ది ఫస్ట్ రోర్` పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీర్ గా విజయ్ లుక్, స్వాగ్ సినీ ప్రియులను విశేషంగా ఆకర్షించింది. అయితే విజయ్ ఇటీవల రాజకీయాల వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతుంది. ఇందుకు పార్టీని అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జన నాయగన్ విజయ్ కెరీర్ లో ఆఖరి చిత్రమని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇక ఆఖరి చిత్రంగా చెప్పబడుతున్న జన నాయగన్ కు విజయ్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత పాన్ ఇండియా హీరోలంతా రూ. 100 నుంచి 150 కోట్ల రేంజ్‌లో పారితోషికం అందుకున్నారు. కానీ విజయ్ వారిందరినీ మించిపోయాడు. మరికొద్ది నెలల్లో విడుదల కాబోతున్న జన నాయగన్ కోసం ఏకంగా రూ. 275 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా సౌత్‌లో విజయ్ రికార్డ్ సృష్టించాడనే చెప్పుకోవచ్చు.