గత ఎన్నికల్లో గెలిచింది కూటమి కాదని, ప్రజలని, ఇది ప్రజా విజయమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. 175 స్థానాలకు గాను 164 స్థానాలతో ప్రజలు రికార్డు విజయం అందించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా ఈ ఏడాదిలోనే సుపరిపాలన అందించామని అన్నారు.
వైసీపీ ఐదేళ్లలో సాధించలేనిది కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించిందని చెప్పారు. కానీ, ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ప్రజలకు సంక్షేమంతో పాటు..రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ ల సారథ్యంలో పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు.
1000 రూపాయల పెన్షన్ పెంచడానికి జగన్ కు ఐదేళ్లు పట్టిందని, చంద్రన్న కేవలం ఒకే ఒక్క సంతకంతో పెన్షన్ 1000 రూపాయలు పెంచారని ప్రశంసించారు. ఐదేళ్ల అరాచక పాలనలో ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, కేసులు, అరెస్టులు నిత్యకృత్యమని విమర్శించారు. విధ్వంస పాలన పై ప్రజలు తిరగబడి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారని, ఈ ఐదేళ్ల సుపరిపాలనలో తొలి అడుగు విజయవంతంగా వేశామని చెప్పారు.
ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ప్రశాంతత వచ్చిందని, జనం మొఖంలో చిరునవ్వు వచ్చిందని, ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు వచ్చిందని, నియంత పాలన నుండి ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందని లోకేశ్ అన్నారు.
కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకటి గుర్తుపెట్టుకోవాలని, గత పాలకుల అహంకారం, అరాచకంతో 151 – 11 అయ్యిందని గుర్తు చేశారు. కాలర్ ఎగరేసి తిరగడం కాదని, ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు.