సున్నితమైన అంశాల విషయంలో తొందరపాటు అస్సలు పనికి రాదు.ఈ విషయాన్ని దేశంలోనే అత్యుత్తమ సర్వీసుల్లో ఉన్న వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంలో పని చేసే ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఎంత అప్రమత్తంగా ఉంటారో తెలిసిందే. అలాంటిది.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర సందర్భంగా చనిపోయిన వ్యక్తికి సంబంధించి.. అంత హడావుడిగా గుంటూరు ఎస్పీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
జగన్ తన పర్యటనలో భాగంగా వాహనం ఢీ కొని సింగయ్య అనే దళితుడు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై పలు వాదనలు వినిపించాయి. తొలుత జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందనే సింగయ్య పడినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జగన్ కాన్వాయ్ వాహనం కింద పడ్డాడని.. సదరు వెహికిల్ లో జగన్ లేదని వార్తలు వచ్చాయి.ఇలాంటి కన్ఫ్యూజన్ లో గుంటూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు.
కొన్ని సీరియస్ అంశాల విషయంలో తొందరపాటు పనికి రాదు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ను ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అధికారిక ప్రకటన చేస్తే బాగుంటుంది. అందుకు భిన్నంగా.. తొందరపాటుతో గుంటూరు ఎస్పీ ప్రకటన చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ పర్యటనలో మరణించిన సింగయ్య ఉదంతంపై మరింత లోతుగా విచారణ జరిపి.. సీసీ ఫుటేజ్ మొదలు.. పలు వీడియోల్ని పరిశీలించిన తర్వాత మొత్తం విషయంపై స్పష్టత వచ్చింది.
సింగయ్య చనిపోయింది జగన్ ప్రయాణిస్తున్న వాహనం మీదనే అని.. ఆయన కదులుతున్న కారు డోర్ బయటకు కాళ్లు పెట్టి ప్రజలకు అభివాదం చేస్తుండటం.. ఆయన్ను చూడాలన్న ఆత్రుతలో సింగయ్య రావటం.. వాహనం టైర్ల కింద పడినంతనే ప్రాణాలు పోవటం తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ లో జరిగింది ఒకటైతే.. గుంటూరు ఎస్పీ హడావుడి కారణంగా.. సింగయ్య మరణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు జగన్ కు ఆయుధాలుగా మారాయి.
తన మీద రాజకీయ కక్షతోనే కేసులుపెడుతున్నారని.. సింగయ్య చనిపోయింది తన వాహనం కింద పడి కాదన్న విషయాన్ని గుంటూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారంటూ కోర్టుకు విన్నవించుకున్న వైనం కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా చేసింది. అదేం సిత్రమో కానీ.. ఇలాంటివన్నీ చంద్రబాబు ప్రభుత్వంలోనే చోటు చేసుకుంటాయి. దీనికి క్లాసిక్ ఎగ్జాంఫుల్ ను పలువురు పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు.
2014లో అధికారంలో ఉన్న వేళలో.. ఎన్నికలకు కాస్త ముందుగా చోటు చేసుకున్న వైఎస్ వివేకా హత్య కేసును సైతం సరిగా డీల్ చేయలేకపోవటం.. హత్య విషయంలో పలు అంశాల్ని బయటకు తీసుకొచ్చే విషయంలో పోలీసుల వైఫల్యం చంద్రబాబు ప్రభుత్వాన్ని భారీగా డ్యామేజ్ చేసిందన్న విషయం అందరికి తెలిసిందే. కట్ చేస్తే.. తాజా ఎపిసోడ్ లోనూ ఇలాంటి పరిస్థితే ఉండటం గమనార్హం. జరగనిది జరిగిందని చెప్పట్లేదు. కనీసం జరిగింది జరిగినట్లుగా బయటకు తీసుకురావటంలోనూ జరుగుతున్న తప్పులపై చంద్రబాబు సీరియస్ గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.