ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక్కొకటిగా నెరవేరుస్తుంది. ఇటీవలె తల్లికి వందనం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈ నెలాఖరులోగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసి రైతులకు అండగా నిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతుంది.
తాజాగా మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ వెల్లడించారు. `నిరుద్యోగ భృతి` పథకం అమలుపై కీలక అప్డేట్ ఇచ్చారు. గత ఎన్నికలకు ముందు నారా లోకేష్ `యువగళం` పేరుతో పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తనను కలిసిన నిరుద్యోగ యువతకు లోకేష్ ఓ కీలక హామీ ఇచ్చారు. పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఉద్యోగాలు రాక అల్లాడిపోతున్న నిరుద్యోగులకు నెలకు రూ. 3,000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. అనంతరం దాన్ని కూటమి మ్యానిఫెస్టోలో కూడా చేర్చారు.
అయితే తాజాగా మచిలీపట్నంలో పర్యటించిన నారా లోకేష్.. కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి పథకాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని ప్రకటన చేశారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయబోమని.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని లోకేష్ తెలిపారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు అందిస్తామని.. త్వరలోనే పథకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తామని వెల్లడించారు. కాగా, ఈ పథకం అమల్లోకి వచ్చిందంటే.. రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుద్యోగి ఖాతాలో నెలకు రూ.3వేల చొప్పున డబ్బులు జమ అవుతాయి. అంటే ఏడాదికి రూ.36 వేలు ప్రభుత్వం నుంచి అందుకోనున్నారు.