టీ న్యూస్ ఛానెల్ న్యూస్ ప్రెజెంటర్ స్వేచ్ఛ వొటేర్కర్ ఆత్మహత్య వ్యవహారం గత రెండు రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. స్వేచ్ఛ జర్నలిస్టు మాత్రమే కాదు, కవయిత్రి కూడా. తల్లిదండ్రులు ఉద్యమకారులు. తనకూ ఆ నేపథ్యం ఉంది. తన ఉద్యోగం వరకే పరిమితం కాకుండా రాజకీయ, సామాజిక అంశాలపై ధైర్యంగా గళం విప్పే ధైర్యం ఉన్న స్వేచ్ఛ ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డం తన సన్నిహితులకు నమ్మశక్యంగా లేదు.
రెండుసార్లు పెళ్లి చేసుకుని అవి విఫలం కావడంతో చాలా ఏళ్లుగా కూతురిని చూసుకుంటూ ఒంటరిగా ఉంటోంది స్వేచ్ఛ. ఐతే స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమంటూ ఆమె తల్లిదండ్రులు కేసులు పెట్టడం.. అతడి మీద స్వేచ్ఛ కూతురు సైతం అనేక ఆరోపణలు చేయడంతో అతను రెండు రోజుల కిందట పోలీసుల ఎదుట లొంగిపోయాడు. స్వేచ్ఛకు, పూర్ణకు ఉన్న సంబంధం మీద ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో తన వెర్షన్ వినిపిస్తూ అతను ఒక లేఖ కూడా విడుదల చేశాడు.
ఇప్పటికే పెళ్లయి పిల్లలున్న పూర్ణ.. స్వేచ్ఛతో సహజీవనం చేయడమేంటి అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. తన భార్య ఎలా ఊరుకుంది అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్ణ భార్య స్వప్న.. మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. పూర్ణ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ కూతురు ఆరోపించడం మీద ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
స్వేచ్ఛతో బంధం విషయంలో తన భర్తతో తనకు గొడవలు వచ్చి, ఆయన్నుంచి దూరంగా వెళ్లిపోయానని చెప్పిన స్వప్న.. స్వేచ్ఛ కూతురిని తన భర్త సొంత కూతురిలాగే చూసుకున్నాడని.. అలాంటి వ్యక్తి మీద ఇలా నిందలు వేయడం తప్పని.. తన భర్త అంత చెడ్డవాడు కాదని ఆమె పేర్కొంది. తన భర్తకు స్వేచ్ఛతో సంబంధం పెట్టుకున్న విషయం.. ఆమె ద్వారానే తనకు తెలిసిందని.. తనను వదిలేయమని ఆమె పూర్ణను వేధించేదని స్వప్న ఆరోపించింది.
ఈ విషయంలో తనకు ఫోన్ చేసి కూడా గొడవ పడేదని పేర్కొంది. తన కూతురికి బట్టలు తీసుకున్న ప్రతిసారీ.. స్వేచ్ఛ కూతురికి కూడా తీసుకునేవాడని.. తనను ఎంతో ప్రేమగా చూసుకున్నాడని.. అలాంటి వ్యక్తి మీద ఇలా తనతో నిందలు ఎవరు వేయిస్తున్నారో తనకు తెలియదని స్వప్న చెప్పింది. తనకు కోర్టు మీద నమ్మకం ఉందని.. ఈ విషయంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొంది.