యుద్ధంలో ఏమైనా జరగొచ్చు. చిన్న నిర్ణయం కూడా పెద్ద నష్టానికి కారణం కావొచ్చు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ - పాక్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు సంబంధించి.. భారత యుద్ధ విమానాల్ని పాక్ కూల్చేసిందన్న వాదన రావటం.. దీనిపై పాకిస్తాన్ పలు సందర్భాల్లో ప్రస్తావించింది. అంతర్జాతీయ మీడియా సైతం ఇదే అంశంపై పలు కథనాలు వెలువరించాయి.అయితే.. అధికారికంగా మాత్రం ఇప్పటివరకు యుద్ధ విమానాలు కోల్పోయినట్లుగా వస్తున్న వార్తల మీద ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 10 (జూన్) న ఇండోనేషియాలో జరిగిన సదస్సుకు భారత నౌకాదళ కెప్టెన్ శివ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి కీలక వ్యాఖ్లు వచ్చాయి. ‘ఆపరేషన్ సిందూర్ తొలి దశలో కేవలం పాకిస్తాన్ ఉగ్రస్థావరాల్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయని.. ఆ దేశ మిలిటరీ వ్యవస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ చేయొద్దని క్లియర్ ఇండికేషన్ ఇచ్చినట్లుగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు సంచలనంగా మారాయి.
దీంతో.. ఆపరేషన్ సిందూర్ వేళ.. భారత్ తన యుద్ద విమానాల్ని కోల్పోయిన అంశంపై క్లారిటీ వచ్చినట్లైంది. అయితే.. ఎన్ని యుద్ధ విమానాల్ని భారత్ కోల్పోయింది? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. శివ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని.. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ పై చర్చించేందుకు పార్లమెంట్ శీతాకాల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
శివ్ కుమార్ వ్యాఖ్యల వీడియో వైరల్ కావటంతో జకార్తాలోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. భారతదేశంలో సైనిక దశాలు.. రాజకీయ నేత్రత్వంలో పని చేస్తాయన్న ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. నిజమే.. పలు దేశాల్లో రాజకీయ పార్టీలకు మించి.. సైన్యాధిపతులు తమ సొంత ఎజెండానుఅమలు చేయటం.. అవసరమైతే సైనిక పాలనను విధిస్తూ.. అధికారంలోని ఫ్రభుత్వాల్ని కూల్చేయటం లాంటి ఎత్తుగడలు అమలు చేయటం తెలిసిందే.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆపరేషన్ సిందూర్ లో మనం కీలకమైన యుద్ధ విమనాల్ని కోల్పోయిన వైనం.. అవెన్ని అన్న దానిపై మోడీ సర్కారు స్పష్టత ఇస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా ఇచ్చిన వివరణ.. శిక కుమార్ చేసిన వ్యాఖ్యలకు పొంతన లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అ నేపథ్యంలో అసలు నిజాలు ఎప్పుడు వెలుగు చూస్తాయో?