ఇటీవల మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ఆహ్వానితుల్లో 54 మంది రాకపోవడం, వారిలో 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండడం పై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అమెరికాలో తానా, ఆటా, నాటా సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సంబరాల్లో భాగమై కాస్త చిల్ అవుదామని దాదాపు 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు అమెరికా బాట పట్టారు. కానీ తాజాగా బాబు ఇచ్చిన వార్నింగ్ ఎఫెక్ట్ తో వారి చిల్ కు చిల్లు పడింది.
పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రలకు పలు అంశాలపై ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే అమెరికా పర్యటనలో ఉన్న 15 మంది ఎమ్మెల్యేల తీరు పట్ల బాబు చిర్రుబుర్రులాడారు. కొందరు ఎమ్మెల్యేలకు పార్టీ సమావేశం కన్నా ఇతర కార్యక్రమాలు ఎక్కువయ్యాయని బాబు ఆగ్రహించారు. విస్తృత స్థాయి సమావేశానికి రానివారు.. తమ నియోజకవర్గాలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునేవారు ఇక అక్కడే ఉండటం ఉత్తమం అన్నారు.
తానా, ఆటా కార్యక్రమాలకు ఎవరెవరు టికెట్లు బుక్ చేసుకున్నారో తన వద్ద లిస్టు ఉందని.. తానా, ఆటా అంటూ తిరిగితే ప్రజలు టాటా చెప్తారని బాబు వార్నింగ్ ఇచ్చారు. దీంతో పొలిటికల్ ప్రెజర్ కుక్కర్లో నుంచి బయటపడి అమెరికాలో జాలీగా ఎంజాయ్ చేద్దామనుకున్న ఆ 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలినట్లైంది. చేసేదేమి లేక ఇప్పుడు వారంతా తట్టా బుట్టా సద్దుకుని ఏపీకి రిటర్న్ అవుతున్నారట.