వైసీపీ ముఖ్య నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు 3200 కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో నిధులను దారిమళ్లించడంలో మోహిత్ రెడ్డి కూడా కీలక రోల్ పోషించారన్నది ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న అధికారులు, వైసీపీ నాయకుల నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా చెవిరెడ్డి మోహిత్‌పైనా కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా అరెస్టు అయ్యారు. మద్యం కుంభకోణంలో వచ్చిన నిధులను ఎన్నికల్లో ప్రచారానికి వినియోగించడంతోపాటు.. ప్రజలకు కూడా పంపిణీ చేశారని ఆయనపై సిట్ అధికారులు కేసు పెట్టారు. ప్రస్తుతం విచారణ ఖైదీగా ఉన్న భాస్కరరెడ్డి ఉన్నారు. ఈ కేసులో మోహిత్ రెడ్డిని విచారించేందుకు సిట్ అధికారులు రెడీ అవుతున్న సమయంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదేసమయంలో తనకు ముందస్తు బెయిల్ కావాలని.. అసలు తనపై కేసును కొట్టివేయాలని కోరుతూ.. ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన కోర్టు.. తాజాగా కొట్టి వేసింది.
ముందస్తు బెయిల్‌తోపాటు.. క్వాష్ పిటిషన్‌ను కూడావిజయవాడలోని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దీంతో మోహిత్ రెడ్డికి ప్రస్తుతానికి దారులు మూసుకుపోయాయి. ఆయన తిరిగి.. హైకోర్టును ఆశ్రయించడమో.. లేదా న్యాయపరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడమో చేయాలి. కానీ.. సిట్ అధికారులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. మోహిత్ రెడ్డికోసం వెతుకుతున్నా రు.
ఆయనను ఎక్కడున్నా అరెస్టు చేసేందుకు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మోహిత్ రె్డి లొంగిపోయి.. వాస్తవం ఒప్పేసుకుంటే.. ఆయనపై నమోదైన కేసులో కొంతలో కొంత బయట పడే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. తాజాగా కోర్టు తీర్పు తర్వాత.. సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారు. మంగళవారంలోగా.. మోహిత్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని సిట్ అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.