అగ్ర నిర్మాత దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ మీద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఇప్పుడు మామూలు ఆగ్రహంతో లేరు. చరణ్‌తో రాజు నిర్మించిన గేమ్ చేంజర్ డిజాస్టర్ కాగా.. ఆ సినిమా ఫెయిల్యూర్ గురించి రాజు తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు చరణ్ అభిమానులకు రుచించడం లేదు. అందులోనూ శిరీష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గేమ్ చేంజర్ డిజాస్టర్ అయి తాము గట్టి దెబ్బ తిన్నా హీరో, దర్శకుడు తమకు ఫోన్ చేసి పరామర్శించలేదని కామెంట్ చేయడం ఫ్యాన్స్‌ను మరింత ఆగ్రహానికి గురి చేసింది.
ఈ నేపథ్యంలో అభిమానులు నిన్నట్నుంచి సోషల్ మీడియాలో చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ అభిమానుల పేరుతో ఒక లేఖ కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది. గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ గురించి మళ్లీ మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఈ లేఖలో అభిమానులు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ లేఖలో ఫ్యాన్స్ అనేక ప్రశ్నలు కూడా సంధించారు.
''సినిమా అనేది ఒక వ్యాపారం. దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయనేది అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్‌లో చేసే సినిమాలు అన్ని మీ వల్లే విజయాలు, లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు, ఒక సినిమా నష్ట పోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంత వరకూ న్యాయం?'' అని పేర్కొన్న ఫ్యాన్స్.. మరిన్ని ప్రశ్నలు సంధించారు.
1) ‘1 నేనొక్కిడినే’ సమయంలో 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా?
2) మైత్రీ మూవీ మేకర్స్‌కు ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి సంభాషించారా?
3) సైంధవ్ సినిమా ఫెయిల్ అయితే, ఆ నిర్మాత వెంకటేశ్ గారి గురించి ఎక్కడా ఒక్క మాట చెడ్డగా మాట్లాడలేదు!
4) సంక్రాంతి వస్తున్నాం సినిమా హిట్ అయితే వచ్చిన లాభాల్లో వెంకటేశ్ గారికి ఎంత ఇచ్చారు. ముందు మీరు మాట్లాడుకున్న రెమ్యునరేషన్ ఇచ్చారా? ఎక్కువ ఏమైనా ఇచ్చారా?
5) ‘దర్శకుడు శంకర్ ఉన్నాడు’ అని వెళ్లింది ఎవరు? ఒక సంవత్సరం అంటూ 3 ఏళ్లు హీరో సమయం వృధా చేసింది ఎవరు?
6) ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత మీతో సినిమా చేసిన హీరోపై విషం చిమ్మడం కరెక్టేనా?
7) మా అభిమానులు 3 ఏళ్లుగా సినిమా కోసం ఎదురుచూసి, విడుదలైన సినిమా ఫ్లాప్ అయిందని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతి రోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ హీరో గురించి, సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు.
8) ప్రతి ప్రెస్‌మీట్, ప్రతి ఇంటర్వూలో పదేపదే దీని గురించే చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురి చేస్తున్నారు.
ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ ఛేంజర్ సినిమా గురించి కానీ, రామ్‌చరణ్ గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఖబడ్దార్
ఇలా సాగింది ఆ లేఖ. మరి ఇది చరణ్ అభిమాన సంఘం, పీఆర్ టీం అనుమతితోనే బయటికి వచ్చిందా అన్నది తెలియదు కానీ.. సోషల్ మీడియాలో చాలామంది మెగా ఫ్యాన్స్ అయితే ఈ లేఖకు మద్దతుగా మాట్లాడుతున్నారు.