ఏపీ బీజేపీ కొత్త బాస్ గా పోకల వంశీ నాగేంద్ర మాధవ్ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతో గత రెండేళ్ల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీలో కీలక పాత్రను పోషిస్తున్న పురందేశ్వరి ఇప్పుడు మాజీ అయిపోయారు. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా మాత్రమే ఉన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష విషయంలో చాలా ఊహాగానాలే తెరపైకి వచ్చాయి. ఓవైపు పార్టీ జాతీయ నాయకత్వం మళ్లీ పురందేశ్వరికే ఆ పదవిని కట్టబెట్టనుందని ప్రచారం జరగగా.. మరోవైపు కాదు ఆమె పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన నేపథ్యంలో పార్టీ సారధిని మార్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.
ఫైనల్ గా ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ కి ఓటు వేసింది. అయితే ఈ అంశంపై పురందేశ్వరి పైకి బాగానే ఉన్నా.. లోలోపల మాత్రం తీవ్ర అసహనంతో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఇందుకు కారణం పురాందేశ్వరి చేసిన తాజా కామెంట్సే. రెండేళ్ల క్రితం అమర్నాథ్ ఆధ్యాత్మిక తీర్ధ యాత్రలో ఉన్న టైమ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు స్వయంగా ఫోన్ చేసి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్నిక అయ్యారని చెప్పారు.
అప్పటి నుంచి పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేశానన్నారు. ఎందరో పెద్దలను స్పూర్తిగా తీసుకొని పట్టుదలతో పనిచేశానని.. స్వలాభపేక్షకు తావు లేకుండా అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించానని గుర్తు చేసుకున్నారు. కొన్ని నిర్ణయాలు నచ్చకపోయినా పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకున్నానని.. ఈ రెండేళ్ల కాలంలో తనకు అన్ని విధాలుగా సహకరించిన, ప్రోత్సహించిన వారికి మరియు తనను ప్రతిఘటించిన వారికి పురందేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.
అయితే పదవులు శాశ్వతం కాదని తెలుసు.. కానీ ఒక పదవి మాత్రం తన నుంచి ఎవరూ దూరం చేయలేరని, అదే కార్యకర్త పదవని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఇక నుంచి ఒక కార్యకర్తగానే పార్టీ బలోపేతం కోసం పని చేస్తానన్నారు. పురందేశ్వరి చేసిన ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నాడు పిలిచి మరీ పదవిచ్చిన బీజేపీ.. నేడేమో కార్యకర్తగా మార్చేశారని పురందేశ్వరి ఆవేదన చెందుతున్నారా? అందుకే ఆ విధంగా మాట్లాడుతున్నారా? అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కాగా, గత ఏడాది ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్ర మంత్రి అవ్వాలని పురందేశ్వరి ఆశపడ్డారు. కానీ అది జరగలేదు. ఇప్పుడేమో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని కూడా కోల్పోవడం ఆమెకు పెద్ద షాక్ తగిలినట్లైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.