ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనపై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదు అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత నెల 22న తమిళనాడు మధురైలో అట్టహాసంగా నిర్వహించబడిన మురుగ భక్తర్గళ్ మహానాడులో బీజేపీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్, కె. అన్నామలై పాల్గొన్న సంగతి తెలిసిందే. పంచెకట్టు, విభూదితో ఆ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా మారిన పవన్ కళ్యాణ్.. తన ప్రసంగంతో తమిళనాట పెను దుమారం రేపారు.
నాస్తికులు అంటే దేవుడ్నే నమ్మరు.. కానీ, కొందరు మాత్రం హిందూ దేవుళ్లనే నమ్మమంటున్నారు. హిందూధర్మాన్ని తక్కువ చేస్తున్నారు. హిందువుల్ని ప్రశ్నించేవారికి అరేబియా నుంచి వచ్చిన మతాల్ని ప్రశ్నించే దమ్ముందా? అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హిందువులు ఏకతాటిపై నిలిచి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆలయాలను ఆదాయ వనరులుగా చూడడం ఆపాలంటూ డీఎంకే ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పిస్తూ పలు తీర్మానాలు ఆమోదించడం కూడా ఈ కార్యక్రమంలో జరిగింది.
అయితే ఆధ్యాత్మిక సభ పేరుతో అనుమతులు తీసుకుని రాజకీయ మతపరమైన ప్రసంగాలు చేయకూడదని ఇప్పటికే హైకోర్టు షరతు విధించింది. ఈ షరతును ఉల్లంఘించారని.. ఓ ఆధ్యాత్మిక సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, ఆమోదించిన తీర్మానాలు మతాల మధ్య విద్వేషాలు పెంచేలా ఉన్నాయని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్‌తో సహా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై, హిందూ మున్నాని నాయకులపై మధురైలోని అన్నానగర్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మధురైకి చెందిన న్యాయవాది, పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ కోఆర్డినేటర్ ఎస్. వంజినాథన్ ఇచ్చిన ఫిర్యాదుతో భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 196(1)(ఏ), 299, 302, 353(1)(బి)(2) ల కింద ఏపీ డిప్యూటీ సీఎంపై కేసు ఫైల్ అయింది.