టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన హీరోల్లో తరుణ్ ఒకరు. నటి రోజా రమణి తనయుడు అయిన తరుణ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి వచ్చి భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాతి కాలంలో హీరోగా టర్న్ అయ్యి అనతి కాలంలోనే టాప్ హీరోల చేత చేరాడు. టాలీవుడ్ లో లవర్ బాయ్ గా గుర్తింపు పొందిన తరుణ్.. హీరోగా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. వరుస పరాజయాలు కారణంగా గత కొన్నేళ్ల నుంచి వెండితెరకు దూరంగా ఉంటున్నాడు.
అయితే సడెన్‌గా తరుణ్ సౌత్ కొరియా అగ్ర నటుడు డాన్ లీతో దర్శనమిచ్చాడు. అమెరికాలోని లాస్ వెగాస్ పర్యటనలో ఉన్న తరుణ్.. అనుకోకుండా డాన్ లీని కలిశాడు. పనిలో పనిగా అతనితో కలిసి ఫోటోలు కూడా దిగాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తరుణ్, డాల్ లీ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. చాలా కాలం తర్వాత తరుణ్ కనిపించడంతో సినీ ప్రియులు సర్‌ప్రైజింగ్‌గా ఫీల్ అవుతున్నారు. మళ్లీ మీరు సినిమాల్లోకి రావాలంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.
అయితే అభిమానులు మాత్రం తరుణ్ లుక్ విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్ గా సూపర్ హ్యాండమ్స్ గా ఉన్న తరుణ్ ఇప్పుడు చాలా మారిపోయాడని అభిప్రాయపడుతున్నారు. కాగా, డాన్ లీ విషయానికి వస్తే.. ఓటీటీలో విడుదలైన ఆయన కొరియన్ సినిమాలు ఇక్కడ విశేషమైన ఆదరణ పొందాయి. ఈ విధంగా తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న డాన్ లీను.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ `స్పిరిట్`లో విలన్‌గా తీసుకున్నారని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. కాకపోతే దీనిపై ఇంతవరకు చిత్రబృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.