గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ లీడర్ వల్లభనేని వంశీకి జైలు నుంచి మోక్షం లభించింది. ఎట్టకేలకు నేడు ఆయన విడుదల అయ్యారు. గన్నవరం టీడీసీ ఆఫీసుపై దాడి, ఫిర్యాదుదారుడిని అపహరించిన కేసులో 2025 ఫిబ్రవరి 13న వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత పలు స్టేషన్లలో దాదాపు 11 కేసులు వంశీ పై నమోదు అయ్యాయి. ఒక కేసులో బెయిల్ తెచ్చుకునే లోపే మరో కేసులో రిమాండ్ పడటంతో గత కొద్ది నెలల నుంచి వంశీ జైల్లోనే ఉన్నారు.
అయితే మంగళవారం నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివీడు రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది అలాగే మరోవైపు సుప్రీంకోర్టులో కూడా వంశీకి భారీ ఊరట లభించింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో వంశీ తెచ్చుకున్న ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలాగే అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో తమకు సమర్పించాలని ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను జులై 16వ తేదీకి వాయిదా వేసింది.
దీంతో దాదాపుగా 137 రోజులు జైలు జీవితం గడిపిన అనంతరం వల్లభనేని వంశీ నేడు రిలీజ్ అయ్యారు. ఆయన తరపు న్యాయవాదులు ఈరోజు మధ్యాహ్నం వంశీ బెయిల్ ఆర్డర్ కాపీలతో విజయవాడ సబ్ జైలుకు చేరుకున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, తలశిల రఘురామ్ కూడా సబ్ జైలు వద్కు వెళ్లారు. బెయిల్ ఆర్డర్ కాపీలను సమర్పించిన అనంతరం జైలు అధికారులు వంశీని విడుదల చేశారు.