‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో కెరీర్ పీక్స్ అందుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత అందరూ అతణ్ని ‘గ్లోబల్ స్టార్’ అని పిలవడం మొదలుపెట్టారు. చరణ్ పెర్ఫామెన్స్‌కి హాలీవుడ్లో సైతం ప్రశంసలు దక్కాయి. కానీ ఆ తర్వాత చరణ్ నుంచి వచ్చిన ‘ఆచార్య’, ‘గేమ్ చేంజర్’ సినిమాలు డిజాస్టర్లు కావడంతో మెగా ఫ్యాన్స్ డల్ అయిపోయారు. ప్రస్తుతం వాళ్ల ఆశలన్నీ ‘పెద్ది’ చిత్రం మీదే ఉన్నాయి. ‘
ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ సినిమాకు కావాల్సినంత హైప్ ఉంది. కొన్ని నెలల కిందట రిలీజ్ చేసిన టీజర్ వైరల్ అయి సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమాలో భాగమైన అందరూ ‘పెద్ది’ గురించి గొప్పగానే చెబుతున్నారు. మామూలుగా తన సినిమాల గురించి గొప్పలు చెప్పుకోని రామ్ చరణ్ సైతం ‘పెద్ది’ గురించి లేటెస్ట్‌గా ఒక ప్రమోషనల్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.
తన కెరీర్లో చేసిన అత్యంత యునీక్ స్క్రిప్టుల్లో ‘పెద్ది’ ఒకటని చరణ్ వ్యాఖ్యానించాడు. తన కెరీర్లో భారీ విజయాలందుకున్న రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాల కంటే కూడా ‘పెద్ది’ విషయంలో తాను ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నానని చరణ్ చెప్పడం విశేషం. మామూలుగా తాను తన సినిమాల గురించి ఎక్కువ చెప్పనని, అయినా సరే ‘పెద్ది’ గురించి ఇలా చెప్పానంటే దాని ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చని చరణ్ పేర్కొన్నాడు. కథ తనకు అంత కొత్తగా అనిపించిందని చరణ్ చెప్పాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాతో చరణ్ బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడనే నమ్మకాన్ని ఈ కామెంట్స్ మరింత పెంచుతున్నాయి.
వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం సగం దాకా చిత్రీకరణ జరుపుకుంది. వచ్చే ఏడాది మార్చి చివరి వారంలో ‘పెద్ది’ ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ షెడ్యూల్స్ ప్రకారమే సాగుతున్న నేపథ్యంలో సినిమా వాయిదా పడడం లాంటిదేమీ జరక్కపోవచ్చు. చరణ్ సరసన జాన్వి కపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.