టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అల్లు అర్జున్ ఎప్పుడు ఎవరితో సినిమా చేస్తాడో చెప్పడం కష్టం. ఒక కాంబినేషన్ గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ కాంబోలో సినిమా మొదలవడమే తరువాయి అనుకుంటాం. అంతలో అది పక్కకు వెళ్లిపోయి ఇంకో ప్రాజెక్టు తెరపైకి వస్తుంది. ‘పుష్ప-2’ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా అనుకుంటే.. అది ఆగిపోయి అట్లీ సినిమా మొదలవడం తెలిసిందే.
అట్లీ మూవీ తర్వాత బన్నీ ఎవరితో జట్టు కడతాడనే విషయం సస్పెన్సుగా మారింది. ఐతే అగ్ర నిర్మాత దిల్ రాజు మాత్రం.. బన్నీకి, ప్రశాంత్ నీల్‌కు ముడిపెట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బన్నీతో ‘పరుగు’, ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి హిట్ మూవీస్ తీసిన రాజు.. మళ్లీ ఓ సినిమ ాచేయాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. రాజుకు కమిట్మెంట్ అయితే ఇచ్చాడు కానీ.. సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్నదే తెలియడం లేదు. ఇంతకీ ఈ చిత్రానికి దర్శకుడు ఎవరా అని అభిమానులు చూస్తున్నారు.
ఐతే ‘తమ్ముడు’ సినిమా ప్రమోషనల్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజు.. బన్నీతో తాను చేయబోయే సినిమా గురించి మాట్లాడాడు. ప్రశాంత్ నీల్, బన్నీ కాంబినేషన్లో ‘రావణం’ అనే సినిమా తీయడానికి సన్నాహలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందన్నది మాత్రం చెప్పలేమన్నాడు రాజు. బన్నీ, నీల్ ఎవరికి వాళ్లు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని.. ఆ కమిట్మెంట్లను పూర్తి చేసుకుని వచ్చాక ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తామని చెప్పారు రాజు.
ప్రశాంత్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ తీస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన ‘సలార్-2’ చేయాల్సి ఉంది. అట్లీ మూవీని పూర్తి చేసిన తర్వాత బన్నీ.. వేరే సినిమా ఒకటి చేసి ఆ తర్వాత నీల్‌తో జట్టు కట్టే అవకాశముంది. ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా దీనికి బాక్సాఫీస్ దగ్గర ఆకాశమే హద్దు అని చెప్పాలి.