తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సొంత నియోజకవర్గంలో బాబుకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. బుధవారం సాయంత్రం శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లికి చేరుకొని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే పథకాల గురించి గ్రామస్థులకు వివరించారు.
చంద్రబాబును చూసి స్థానిక ప్రజలు ఆనందంతో పొంగిపోయారు. మహిళలు హారతులిచ్చి ఆత్మీయంగా బాబును ఇంటికి ఆహ్వానించారు. కొందరు గ్రామస్తులు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బాబు జైలుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు విరాభిమాని అయిన ఓ వృద్ధుడు ముఖ్యమంత్రిని చూడగానే ఫుల్ ఎమోషనల్ అయిపోయారు.
`శ్రీరాముడు అజ్ఞాత వాసం చేసినట్టే, మీరు కూడా చేయని తప్పునకు 53 రోజులు అజ్ఞాత వాసం చేశారు. మీరు జైల్లో ఉన్న ఆ 53 రోజు నేను ఉపవానం ఉన్నాను` అని ఆ వృద్ధుడు చెప్పడంతో చంద్రబాబుతో సహా అందరూ చలించిపోయారు. మీలాంటి వారి అభిమానం, ఆశీస్సులే తనను ముందుకు నడిపిస్తున్నాయని చంద్రబాబు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. కాగా, నేడు కుప్పం ఏరియా హాస్పిటల్ వద్ద టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను బాబు ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు స్వగృహంలో అధికారిక సమీక్షలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్ని ముగించుకొని సీఎం బెంగళూరుకి తిరుగు ప్రయాణం అవుతారు.