ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చంద్రబాబు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి పథకాల అమలు తీరు గురించి ప్రజలను అడిగి తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. అలా సూచించిన చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. కుప్పంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. వారికి పథకాలు అందుతున్నాాయా లేదా అని చంద్రబాబు అడిగారు. పథకాల అమలులో ఇబ్బందులుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
ప్రజల జీవితాలలో నిజమైన మార్పు రావాలంటే ఇంటింటికి వెళ్లాలని, అధికార పీఠాలపై కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం కాదని చంద్రబాబు నిరూపించారు. జనం వారి మధ్యకి వెళ్లి వారి సమస్యలు స్వయంగా తెలుసుకోవడం అవసరమని చాటిచెప్పారు. తిమ్మరాజుపల్లిలో సుమారు రెండున్నర గంటల పాటు పర్యటించిన చంద్రబాబు ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు.
తండ్రి బాటలోనే తనయుడు నారా లోకేశ్ కూడా పయనిస్తున్నారు. మంగళగిరిలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటింటికీ ప్రచారం కార్యక్రమంలో ఎమ్మెల్యేలకంటే ముందు చురుగ్గా మంత్రి లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఇంకా చాలామంది కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఇంటింటికి ప్రచారం కార్యక్రమం మొదలుబెట్టలేదు. కానీ, చంద్రబాబు, లోకేశ్ లు ఎమ్మెల్యేలకన్నా ముందే ప్రచారం మొదలుబెట్టి అందరికీ షాకిచ్చారు. మిగతా ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలుస్తున్న చంద్రబాబు, లోకేశ్ లపై ప్రశంసలు కురుస్తున్నాయి.