ఆదిలోనే అగ్నిప‌రీక్ష‌... `మాధ‌వ్‌`సార‌థ్యం క‌ష్ట‌మేనా?!

admin
Published by Admin — July 04, 2025 in Politics, Andhra
News Image
ఏపీ బీజేపీ సార‌థ్య బాద్య‌త‌లు చేప‌ట్టిన పాకాల వెంక‌ట నాగేంద్ర మాధ‌వ్‌(పీవీఎన్ మాధ‌వ్‌)కు ఆదిలోనే అగ్ని ప‌రీక్ష ఎదురైంది. పార్టీలో ఉన్న అసంతృప్తి ఆయ‌న తొలి రోజే తెలిసి వ‌చ్చింది. గ‌త ఏడాది కాలంలో నాయ‌కులు మ‌న‌సులో దాచుకున్న మాటలు .. మాధ‌వ్ పార్టీ ప‌గ్గాలు ప‌ట్టీ ప‌ట్ట‌డంతోనే వ‌ర‌ద‌లా దూసుకువ‌చ్చాయి. `మ‌న సంగ‌తేంటి?` అంటూ.. ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర ఆయ‌నను ఉక్కిరి బిక్కిరికి గురి చేసింది. ఎందుకంటే.. పీవీఎన్ మాధ‌వ్‌.. సొంత కుటుంబానికి చెందిన‌(అంటే పార్టీకి) నాయ‌కుడే. ఆయ‌న తండ్రి నుంచి కూడా రాజ‌కీయాలు చేస్తున్నారు.
 
దీంతో ఇత‌ర నాయ‌కుల‌కు చాలా చొర‌వ‌, చ‌నువు కూడా ఉన్నాయి. నిన్న‌టి వ‌ర‌కు పార్టీ చీఫ్‌గా చేసిన పురందేశ్వ‌రి పొరుగు పార్టీ నుంచి వ‌చ్చారు. పైగా ఆమెకు ఆర్ ఎస్ ఎస్ వంటి బీజేపీ సైద్ధాంతిక పార్టీతో సంబంధాలు కూడా త‌క్కువే. అందుకే.. ఆమె ఉండ‌గా.. ఎవ‌రూ పెద్ద‌గా మాట్లాడ‌లేదు. ఎవ‌రూ స్వ‌రం వినిపించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. అంద‌రూ.. సైలెంట్ అయ్యారు. ఎలా జ‌రిగేది అలా జ‌రుగుతుంద‌ని అనుకున్నారు. కానీ, మాధ‌వ్‌కు ప‌గ్గాలు అప్ప‌గించాక‌.. సీనియ‌ర్ నాయ‌కుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు కూడా త‌మ ఆవేద‌న‌ను చెప్పుకొచ్చారు.
 
అయితే.. వీరి ఆవేద‌న‌.. మాధ‌వ్ పాలిటిక్స్‌కు పెద్ద అగ్ని ప‌రీక్ష‌గా మార‌నుంది. ఎందుకంటే.. గురి చూసి కొట్టిన‌ట్టుగా సీనియ‌ర్లు.. అంద‌రూ ఒకే మాట‌ను ప‌దే ప‌దే వినిపించారు. అదే.. ``మ‌న వాటా మాటేంటి?`` అనే!. అంటే.. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డానికి బీజేపీనే కార‌ణ‌మ‌ని.. బీజేపీ లేక‌పోతే.కూట‌మి లేద‌ని వారి భావ‌న‌. అంతేకాదు.. బీజేపీకి అన్యాయం చేస్తున్నార‌న్న‌ది కూడా వారు బాహాటంగానే చెప్పేశారు. వ‌చ్చే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీకి ప్రాదాన్యం ఉండేలా చూడాల‌ని విష్ణుకుమార్ రాజు, ఆదినారాయ‌రెడ్డి, సోము వీర్రాజు వంటివారు కూడా స్ప‌ష్టం చేశారు.
 
దీంతో పాటు.. మంత్రివ‌ర్గంలోనూ మ‌రో రెండు సీట్లు మ‌న‌కు ఉండాల‌ని విష్ణుకుమార్ రాజు చెప్పుకొస్తున్నారు. ప్ర‌స్తుతం స‌త్య‌కుమార్ యాద‌వ్‌కు చంద్ర‌బాబు కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అయితే.. ఈ రేసులో విష్ణుకుమార్ రాజుతోపాటు.. కామినేని శ్రీనివాస‌రావు(కైక‌లూరు ఎమ్మెల్యే) ఉన్నారు. వీరు ఇద్ద‌రూ కూడా మాధ‌వ్‌పై ఒత్త‌డి పెంచుతున్నారు. వాటాలు వేసుకోవ‌డం కాదు.. బ‌లం ముఖ్య‌మంటూ వారు చెబుతున్నారు. కూట‌మి ఏర్ప‌డేందుకు , రాష్ట్రంలో స‌ర్కారు పంచుకునేందుకు బీజేపీ కీల‌క‌మ‌ని.. అలాంటి పార్టీని విస్మ‌రిస్తే..ఊరుకునేది లేద‌న్న‌ట్టుగా వారు వ్యాఖ్యానించారు. దీనిని బ‌ట్టి మాధ‌వ్‌కు భ‌విష్య‌త్తు అంతా .. చాలా సంక్లిష్టంగానే న‌డ‌వ‌నుందంని అంటున్నారు. సౌమ్యుడిగా పేరొందిన మాధ‌వ్‌.. ఇంత ఫైర్ బ్రాండ్ల‌ను త‌ట్టుకుని ఏమేర‌కు ముందుకు సాగుతారో చూడాలి.
Tags
ap bjp chief madhav testing times leadership
Recent Comments
Leave a Comment

Related News