హరిహర వీరమల్లు అనే సినిమా మొదలైనపుడు, దాని ఫస్ట్ టీజర్ రిలీజైనపుడు పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహం అలాంటిలాంటిది కాదు. పవన్ పొటెన్షియాలిటీ తగ్గ సినిమా అని.. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పవన్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అనుకున్నారు. కానీ ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా విపరీతంగా ఆలస్యమై.. ఏళ్ల తరబడి మేకింగ్ దశలోనే ఉండిపోవడంతో దీని చుట్టూ ఉన్న హైప్ అంతా కరిగిపోతూ వచ్చింది.
అందులోనూ జూన్ 12న రిలీజ్ అన్నాక.. మరోసారి సినిమాను వాయిదా వేయడంతో పవన్ అభిమానులు నీరుగారిపోయారు. ఈ సినిమా మీద ఆశలు వదులుకున్నట్లు కనిపించారు. జులై 24కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించాక కూడా వారిలో ఎగ్జైట్మెంట్ కనిపించలేదు. ఈసారైనా రిలీజవుతుందన్న గ్యారెంటీ లేకపోవడం అందుకు ఓ కారణం. పైగా ఎంతకీ ట్రైలర్ రిలీజ్ చేయకపోవడం వారిని మరింత నిరుత్సాహానికి గురి చేసింది. ట్రైలర్ గురించి అప్‌డేట్ ఇచ్చినపుడు కూడా ఫ్యాన్స్ పెద్దగా ఎగ్జైట్ కాలేదు.
ఐతే ఈ రోజు ఉదయం ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ లాంచ్ అయ్యాక కథ మారింది. సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రెండ్ అవడం మొదలుపెట్టింది. ట్రైలర్ చూసిన వాళ్లందరూ ఆశ్చర్యపోతున్నారు. చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ సినిమా క్రిష్ నుంచి ఫ్లాప్ డైరెక్టర్‌గా ముద్ర పడ్డ జ్యోతికృష్ణకు చేతులకు మారడంతో ట్రైలర్ మీద అభిమానుల్లో పెద్దగా అంచనాలే లేవు. కానీ ట్రైలర్‌ను చాలా ఆసక్తికరంగా కట్ చేయడం.. ఎలివేషన్లు పీక్స్‌లో ఉండడం.. భారీతనానికి లోటు లేకపోవడం.. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్‌లా కనిపిస్తుండడంతో సర్వత్రా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.
ట్రైలర్ ఎలా ఉందని పోల్స్ పెడితే.. అందరూ సానుకూలంగానే స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసే సినిమాల విషయంలో ఎంత నెగెటివ్‌గా కనిపించినా.. రిలీజ్ టైంకి వచ్చేసరికి ఫ్యాన్స్ కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోతారు. రావాల్సిన హైప్ అంతా వచ్చేస్తుంది. వాళ్లు ఎంతగానో వ్యతిరేకించిన గోపాల గోపాల, కాటమరాయుడు, వకీల్ సాబ్ లాంటి చిత్రాల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడొస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్‌తో ‘హరిహర వీరమల్లు’ కూడా రిలీజ్ టైంకి కావాల్సినంత హైప్ తెచ్చుకుంటుందని అంచనా వేస్తున్నారు.