గుంటూరు జిల్లా పర్యటనలో గత నెల 18న వైసీపీ అధినేత జగన్ కాన్వాయ్ కింద పడి నలిగిన సింగయ్య వ్యవహారం.. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు తాజాగా మండిపడ్డారు. సింగ య్య భార్య లూర్దు మేరీ మీడియా ముందుకు వచ్చి చేసిన కామెంట్లు అవాస్తవమని పేర్కొన్న బాబు.. దీనిని రాజకీయం చేసేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మేరీని భయ పెట్టి, బెదిరించి.. క్షుద్రరాజకీయాలకు తెరదీశారని మండిపడ్డారు.
సింగయ్య కాన్వాయ్ కింద పడ్డారని తెలిసిన తర్వాత.. ఆయనను కుక్క పిల్ల మాదిరిగా పక్కకు లాగి పడేసి వెళ్లిపోయారని.. ఈ విషయం ఆధారాలతో సహా నిరూపితమైనా.. ఆయన భార్యను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారం చేస్తూ.. రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం.. సొంత పార్టీ కార్యకర్త పట్ల ఇలా ఎవరూ వ్యవహరించరని అన్న చంద్రబాబు.. ఘటన జరిగిన తర్వాత.. తప్పు ఒప్పుకోకుండా.. సింగయ్య భార్యను బెదిరించారని అన్నారు.
ఆమెతో తప్పుడు వాంగ్మూలం ఇప్పించి.. కేసును మాఫీ చేసుకునేలా ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు జగన్పై విమర్శలుగుప్పించారు. ``సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేయాలని చూస్తారా? ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తారు.’’ అని నిప్పులు చెరిగారు. ఈ కేసులో అన్ని వాస్తవాలను పోలీసులు సేకరించారని.. అయినా.. నిజాలు దాచేస్తూ.. జగన్ నీచ రాజకీయాలు, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.
రౌడీషీటర్లను ప్రోత్సహించడం.. హత్యలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం జగన్కు రాజకీయంగా అబ్బిన గొప్ప విద్య అని దుయ్యబట్టారు. ఇలాంటి వారి ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. సింగయ్య భార్య గురించి ప్రస్తావిస్తూ.. గతంలో ఏమందో.. ఇప్పుడు ఆమె ఏం చెప్పిందో అందరూ గమనించాలన్నారు. ఇది బెదిరింపు రాజకీయం కాదా? అని నిలదీశారు.