2024 సార్వత్రిక ఎన్నికలలో అఖండ విజయం సాధించి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత చంద్రబాబు పదే పదే ఒక మాట చెబుతూ వస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకుంటే 95 నాటి సీఎం చంద్రబాబును చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రెవెన్యూ శాఖ పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు 95 నాటి సీఎం చంద్రబాబును గుర్తు చేసిందని తెలుస్తోంది.
భూ సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారని సమాచారం. సచివాలయంలో రెవెన్యూ శాఖపై నిర్వహించిన కీలక సమీక్ష సందర్భంగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది.
వైసీపీ పాలనా వైఫల్యాలతో ప్రతి గ్రామంలో భూ వివాదాలు, సర్వే సమస్యలు వచ్చాయని చంద్రబాబు మండిపడ్డారట. తహసీల్దార్ కార్యాలయాల్లో వేల సంఖ్యలో అర్జీలు పరిష్కారం కాకుండా పేరుకుపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. భూ సమస్యలను వేగంగా పరిష్కరించి రెవెన్యూ సేవలను సులభతరం చేస్తేనే ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత వస్తుందని చంద్రబాబు అన్నారట.
ఏడాదిలో భూ సమస్యలను పరిష్కరిస్తామని మహానాడులో హామీ ఇచ్చామని, పైపైన మార్పులు కాకుండా క్షేత్రస్థాయి నుంచి రెవెన్యూ శాఖలో సమూల ప్రక్షాళన చేస్తే తప్ప ఫలితాలు రావని ఆయన భావిస్తున్నారుట. సిబ్బంది కొరత, పనిభారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, అదే సమయంలో రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాలని సూచించారట. ఈ సమీక్ష తర్వాత భూ సమస్యల పరిష్కారంపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.