ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవల ఏడాది పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో వైసీపీ విమర్శల దాడికి దిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ ఏకిపారేస్తోంది. దీంతో గత కొద్ది రోజుల నుంచి వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీకి తన స్టైల్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నరసింహపురంలో రూ. 1290 కోట్ల విలువైన తాగునీటి పథకానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రజలకు కనీసం మంచి నీరు అందించాలన్న ధ్యాస కూడా గత పాలకులకు లేదని వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. గత పాలకులు రౌడీయిజం, గుండాయిజం చేశారు.. ఇప్పుడే అదే ధోరణతో వ్యవహరించి సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తే మాత్రం చూస్తే ఊరుకోమని డిప్యూటీ సీఎం హెచ్చరించారు.
తమ ప్రభుత్వం కక్ష తీర్చుకునేది కాదు.. తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వమన్నారు. 2029 ఎన్నికల్లో అధికారంలో వస్తే మీ అంతు చూస్తామంటున్నారు.. అసలు మీరు రావాలి కదా... మీరు అధికారంలోకి ఎలా వస్తారో మేమూ చూస్తాం అంటూ వైసీపీకి పవన్ సవాల్ విసిరారు. రంపాలు తెస్తాం, కత్తులతో కోస్తాం వంటి తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు భయపడమన్నారు.
మీకు 151 సీట్లు వచ్చి, తాను రెండు చోట్ల ఓడిపోయినప్పుడే ధైర్యంగా నిలబడి పోరాడాము.. అందుకు గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి? రక్తంలో ఎంత వేడి ఉండాలి? అలాంటి మమ్మల్నే మెడకాయలు కోసేస్తామంటే.. కోయడానికి మేమైనా చొక్కా విప్పి చూపిస్తామా? అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ గాలి అడ్డంగా తీసేశారు.