పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్ గా రూపొందిన `హరిహర వీరమల్లు` పార్ట్ 1 జూలై 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. అయితే నిన్న బయటకు వచ్చిన వీరమల్లు ట్రైలర్ ఆ అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్ళింది. ఈ ట్రైలర్ మెగా ఫ్యాన్స్ ను మాత్రమే కాకుండా సాధారణ సినీ ప్రియులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, బీజీఎమ్ అదిరిపోయాయి. ట్రైలర్‌లోని ప్రతి ఫేమ్ అలరించింది.
వీరమల్లు ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా యూట్యూబ్ ను షేక్ చేస్తూ సరికొత్త రికార్డును సృష్టించింది. విడుదలైన 24 గంటల్లోనే హరిహర వీరమల్లు ట్రైలర్ తెలుగు వర్షన్ ఏకంగా 48 మిలియన్స్ పైగా వ్యూస్ ను కొల్లగొట్టింది. టాలీవుడ్ లోనే ఆల్ టైం రికార్డ్ ఇది. అలాగే అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్ 24 గంటల్లోనే 61.7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. `ఇది కేవలం రికార్డు కాదు.. భవిష్యత్తులో రాబోయే చిత్రాలకు వార్నింగ్.. ఈసారి డేట్ మారదు.. ఇండస్ట్రీ రికార్డ్ లు మారతాయ్..` అని పేర్కొంటూ యూనిట్ పోస్టర్స్ ను రిలీజ్ చేసింది. కాగా, హరిహర వీరమల్లు చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా.. బాబీ డియోల్, నాజర్, నార్గిస్ ఫఖ్రీ, అనుపమ్ ఖేర్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.