వైసీపీ అధినేత జగన్ కాన్వాయ్‌లో ఆయన ప్రయాణించే వాహనాన్ని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు తాజాగా సీజ్ చేశా రు. తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసానికి మంగళవారం సాయంత్రం వచ్చిన నల్లపాడు పోలీసులు.. కార్యాలయంలోని వాహనాన్ని తమ వెంట తీసుకువెళ్తామని చెప్పారు. దీంతో తాడేపల్లి వ్యవహారాలను చూసే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. పార్టీ అధినే తతో మాట్లాడి.. వాహనం తాళాలను పోలీసులకు అందించారు. దీంతో వారు తమతో ఆ వాహనాన్ని సీజ్ చేసి తీసుకువెళ్లారు.
ప్రమాదానికి కారణమైన జగన్ ప్రయాణించిన ఫార్చ్యూనర్ కారు AP40DH2349 ను సీజ్ చేసిన పోలీసులు.. దానిని స్వయంగా నడుపుతూ.. నల్లపాడుకు తీసుకువెళ్లారు. మరోవైపు.. గుంటూరు జిల్లా సత్తెనల్లి నియోజకవర్గం పరిధిలోని రెంటపాళ్లలో జగన్ పర్యటించినప్పుడు.. ఆయన కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దీనిలో ఏ2గా జగన్‌ను పేర్కొన్నారు. అయితే.. మాజీ సీఎం కావడంతో అనేక తర్జన భర్జనల అనంతరం.. న్యాయ సలహాలు తీసుకున్నారు.
న్యాయ నిపుణుల సూచనల మేరకు సింగయ్య మృతి కేసులో ఏ2గా ఉన్న మాజీ సీఎం జగన్‌కు నోటీసులు ఇచ్చారు. అయితే.. ఆ సమయంలో కార్యాలయంలో ఉన్న వైసీపీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పోలీసుల నుంచి నోటీసులు అందు కున్నారు.అనంతరం వాహనం తీసుకుని పోలీసులు వెళ్లిపోయారు. ఇదిలావుంటే.. తనపై నమోదైన కేసునుకొట్టి వేయాలని కోరుతూ.. జగన్ హైకోర్టుకు వెళ్తే మంచిదని వైసీపీ లీగల్ సెల్ సూచించినట్టు తెలిసింది. కానీ, ఆయన కేసును ఎదుర్కొంటానని.. కోర్టు ద్వారానే ప్రభుత్వానికి తనపై కేసు నమోదు చేయచ్చో చేయకూడదో చెప్పేలా చేద్దామని వ్యాఖ్యానించినట్టు తాడేపల్లి వర్గాలు తెలిపాయి.